Telugu Gateway
Andhra Pradesh

రాజీనామా చేశాక..సస్పెండ్ ఏంటి?

రాజీనామా చేశాక..సస్పెండ్ ఏంటి?
X

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీకి తాను ఎప్పుడో రాజీనామా చేశానని..ఇప్పుడు ఆయన తనను సస్పెండ్ చేయటం ఏంటి? అని ప్రశ్నించారు. ఇలాగే ముగ్గురు..నలుగురిని సస్పెండ్ చేస్తే చంద్రబాబు ఇంటి ముందు ఉన్న ఆ సెక్యూరిటీ ఔట్ పోస్టు కూడా ఉండదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే ఢిల్లీ వెళ్ళి టీడీపీ ఎంపీల రాజీనామాల కోసం ధర్నా చేయగలరా? అని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ కు, నారా లోకేష్ కు నక్కకు నాగలోకానికి మధ్య ఉన్న తేడా ఉందని అన్నారు. ‘నేను ప్రజల్లో ఉన్న మనిషిని. ప్రజలు ఎటువైపు అనుకూలంగా ఉన్నారో నాకు తెలియదా?. ప్రజలకు ఉపయోగపడే పథకాలు వచ్చినప్పుడు అందరూ స్వాగతించాల్సిందే. ’ అని ఆయన అన్నారు.

‘నాపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల బతుకు ఏంటో అందరికీ తెలుసు. నా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మాత్రానా నా ఇమేజ్‌ ఏమీ తగ్గదు. ఎన్నికల సమయాల్లో సూట్‌కేసులు కొట్టేసేవాళ్లు నా పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. నేను ఏమి అనుకున్నానో అది మనస్పూర్తిగా చేస్తాను. నన్ను ఎవరూ ప్రభావితం చేయలేదు. మనసాక్షిగానే వ్యవహరిస్తున్నాను. ప్రభుత్వం మంచి పనులు చేస్తే పార్టీలకు అతీతంగా మద్దతు చెప్పాం. ఇక మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it