Telugu Gateway
Politics

స్పీకర్ కు ‘ఆ అధికారం’ లేదు

స్పీకర్ కు ‘ఆ అధికారం’ లేదు
X

కర్ణాటక అసెంబ్లీలో ఫిరాయింపులకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు బుధవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ సురేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూనే..ఈ 17 మంది 2023 వరకూ ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ స్పీకర్ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పోటీ నుంచి నిరోధించే అధికారం స్పీకర్ కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో అనర్హత వేటు పడిన 17 మంది కాంగ్రెస్, జెడీఎస్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమం అయింది. అదే సమయంలో వీరు గెలిచి మంత్రి పదవులు కూడా దక్కించుకోచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అనర్హత అంశంపై కర్ణాటక హైకోర్టుకు వెళ్ళకుండా సుప్రీంకోర్టుకు రావటంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. డిసెంబర్ 5న ఖాళీ అయిన 17 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

అసెంబ్లీలో జరిగిన బలపరీక్షకు ఈ పదిహేడు మంది హాజరు కాకపోవటం వల్లే కాంగ్రెస్, జెడీఎస్ సంకీర్ణ సర్కారు కుప్పకూలిన విషయం తెలిసిందే. తొలుత కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయగా, మరికొంత మంది మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉండిపోయారు. అయితే ఎమ్మెల్యేల రాజీనామాలు..ఓటింగ్ కు దూరంగా ఉండటం అంతా బిజెపి డైరక్షన్ లోనే సాగిందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. మరి ఈ ఫిరాయింపుదారులను ప్రజలు తిరస్కరిస్తారా? లేక మళ్ళీ పట్టం కడతారా? అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it