Telugu Gateway
Politics

రాఫెల్ డీల్ ..కేంద్రానికి సుప్రీం క్లీన్ చిట్

రాఫెల్ డీల్ ..కేంద్రానికి సుప్రీం క్లీన్ చిట్
X

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోడీపై ప్రధాన విమర్శనాస్త్రంగా నిలిచిన ‘రాఫెల్’ విషయంలో కేంద్రానికి సంపూర్ణ ఊరట లభించింది. ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇదే అంశాన్ని తన ప్రచారాస్త్రంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే పెద్దగా ప్రయోజనం లేకుండానే పోయింది. రాఫెల్ విమానాల ధరలను పెంచటంతోపాటు..అనిల్ అంబానీకి చెందిన కంపెనీకి మేలు చేసిపెట్టారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. చివరకు ఈ అంశం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలు అయిన సమీక్ష పిటిషన్లన్నింటినీ కోర్టు తిరస్కరించింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సుప్రీంతీర్పుని సవాల్‌ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ విచారించిన సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది.

దీంతో వివాదాస్పద రాఫెల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు అయింది. అదే సమయంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కరణప పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. రాహుల్‌ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇకముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు సూచించింది. ఫ్రాన్స్‌ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ 2018 డిసెంబర్‌ 14న తీర్పు వెలువరించింది. ఈ తీర్పుని మే 10న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది . దీనిపై దాఖలైన సమీక్ష పిటీషన్‌ను కొట్టి వేస్తూ తాజాగా రాఫెల్‌ డీల్‌ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని నిర్ధారించింది.

Next Story
Share it