Telugu Gateway
Politics

సున్నీ వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం

సున్నీ వక్ఫ్ బోర్డు  కీలక నిర్ణయం
X

దేశమంతటా శనివారం ఒకటే మాట..అయోధ్య...అయోధ్య. ఏ ఇద్దరు కలసినా ఈ అంశంపైణే చర్చ. అయితే ప్రభుత్వాల ముందస్తు సూచనలు..పోలీసుల హెచ్చరికలు కూడా బాగానే పనిచేశాయి. సహజంగా ప్రతి అంశంపై అతిగా స్పందించే సోషల్ మీడియా కూడా చాలా వరకూ అయోధ్య విషయంలో మాత్రంలో ఒకింత సంయమనంతో వ్యవహరించిందనే చెప్పొచ్చు. అయితే సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సున్నీ వక్ఫ్ బోర్డు...తాము దీనిపై సుప్రీంలో రివ్యూ పిటీషన్ వేస్తామని ప్రకటించింది. సాయంత్రానికి మాత్రం మనసు మార్చుకుని తాము రివ్యూ పిటీషన్ వేయటంలేదని పేర్కొంది. అదే సమయంలో రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని సున్నీ వక్ఫ్‌ బోర్డు ప్రకటించింది. కీలకమైన తీర్పు వెలువడిన అనంతరం రివ్యూ పిటిషన్‌ వేయాలని భావించినా.. తీర్పు సమీక్షించిన తరువాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయట్లేదని స్పష్టం చేసింది.

ఈ మేరకు సున్నీ వక్ఫ్‌ బోర్డు ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని.. ఈ తీర్పుపై చర్చించిన తర్వాతే తదుపరి కార్యాచరణకు సిద్ధవుతామని సున్నీ వక్ఫ్‌ బోర్డు న్యాయవాది జిలానీ తొలుత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తీర్పు కాపీ పూర్తిగా చదివిన తర్వాతే రివ్యూ పిటిషన్‌ వేయాలో లేదో నిర్ణయించుకుంటామని అన్నారు. ఏఎస్‌ఐ నివేదికలో ముస్లింలకు అనుకూలంగా ఉన్న అంశాలను కోర్టు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీతో చర్చించిన తర్వాతే వారి నిర్ణయం మేరకు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామని బోర్డు వెల్లడించింది. అయితే తీర్పుపై దాదాపు రెండు గంటల పాటు చర్చించిన కమిటీ సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.

Next Story
Share it