Telugu Gateway
Politics

ఆర్టీసీ సమ్మె...ఐఏఎస్ సునీల్ శర్మకు అఫిడవిట్ షాక్ తప్పదా?!

ఆర్టీసీ సమ్మె...ఐఏఎస్ సునీల్ శర్మకు  అఫిడవిట్ షాక్ తప్పదా?!
X

ఆర్టీసీ సమ్మెకు సంబంధించి సంస్థ ఎండీ, సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ అఫిడవిట్ ఐఏఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సారి ఖచ్చితంగా ఆయన చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సునీల్ శర్మ తీరుపై హైకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసికి సంబంధించి తప్పుడు లెక్కలు ఇఛ్చి కోర్టుతో పాటు..సీఎం, మంత్రిని కూడా సునీల్ శర్మ తప్పుదారి పట్టించారని..ఆయన్ను ఎందుకు విధుల్లో ఉంచారని హైకోర్టు ఇఫ్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సద్దుమణిగినా తాజాగా సునీల్ శర్మ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లోని అంశాలు ఐఏఎస్ వర్గాలతోపాటు ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఏకంగా ప్రభుత్వాన్ని అస్ధిరపర్చేందుకు యూనియన్ నేతలు ప్రతిపక్షాలతో కలసి కుట్ర చేశాయని అఫిడవిట్ లో పేర్కొనటం అంత ఆషామాషీ వ్యవహారం కాదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

సంతకం చేసి..కోర్టులో అఫిడవిట్ రూపంలో సమర్పించారంటే దీనికి సంబంధించిన బలమైన ఆధారాలను సునీల్ శర్మ కోర్టు ముందు చూపించాల్సి ఉంటుందని ..లేకపోతే ఆయన చిక్కుల్లో పడటం ఖాయం అని చెబుతున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రాజకీయ ఆరోపణలు చేసిన చందంగా ఈ అఫిడవిట్ ఉందని..అయితే దీనికి సంబంధించి కోర్టు ముందు ఏమి ఆధారాలు పెడతారో అన్నది అత్యంత కీలకం కానుంది ఇప్పుడు. ఆర్టీసి కార్మిక సంఘాలు, విపక్షాలతో కలసి కుట్ర చేయటమే నిజం అయితే ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేపని అంటే..రాజద్రోహం వంటి సెక్షన్లతో కూడా కేసులు పెట్టొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కెసీఆర్ తోపాటు అధికార పార్టీ నేతలు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ప్రతిపక్షాలతో కలసి సమ్మె చేస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే.

దీనికి నాయకులు కూడా అదే రీతిలో సమాధానం చెప్పారు. ఇది అంతా ఒకెత్తు అయితే ఓ ఆరేడు మంది ఆర్టీసీ నేతల కోసం 48 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను ఫణంగా పెట్టి సమ్మెలో పాల్గొంటారా? అన్న కోణంలో మాత్రం ఎవరూ ఆలోచించటం లేదు. సీఎంతో సహా మంత్రులు, రాజకీయ నేతల విమర్శలు..వ్యాఖ్యలు ఎలా ఉన్నా కూడా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అఫిడవిట్ రూపంలో ఇంతటి సంచలన ఆరోపణలు చేయటం మాత్రం దుమారం రేపుతోంది. ఏది ఏమైనా హైకోర్టులో సోమవారం నాడు జరిగే పరిణామాలు అత్యంత కీలకం కానున్నాయి.

Next Story
Share it