జగన్ అవినీతిపై ఐఐఎం అధ్యయనం...టీడీపీ లేఖ
ఏపీలో అవినీతి నిరోధించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఏపీ సర్కారు ఇటీవలే ప్రతిష్టాత్మక సంస్థ ఐఐఎంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పాలనలో అవినీతి మూలాలు ఎక్కడ ఉన్నాయనే అంశాన్ని కనిపెట్టడంతోపాటు దీన్ని అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఐఐఎం ఓ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఏ స్థాయిలో అవినీతి ఉంది అనే అంశాన్ని గుర్తించటంతోపాటు..దీన్ని ఎలా నివారించవచ్చు అన్నది అధ్యయనం చేసే బాధ్యతను ఐఐఎం అహ్మదాబాద్ బృందానికి అప్పగించారు. ఈ వ్యవహారంపై టీడీపీ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. జగన్ అవినీతిపై కూడా అధ్యయనం చేయాలి ఐఐఎం అహ్మదాబాద్‍కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు.
జగన్‍పై 31 క్రిమినల్ కేసులతోపాటు సీబీఐ విచారణ కొనసాగుతోందని తెలిపారు. జగన్ ఎన్నో సూట్‍కేస్ కంపెనీలు ఏర్పాటుచేసి వేల కోట్ల రూపాయల నిధులు మళ్ళించారని ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడ్డారని తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా ఇసుక, మద్యం, మైనింగ్ లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కళా వెంకట్రావు ఆరోపించారు. ఐఐఎం దీనిపై అధ్యయనం చేస్తే తాము పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.