Telugu Gateway
Politics

శివసేన ప్రయత్నాలకు చెక్..ఎన్సీపీకి గవర్నర్ పిలుపు

శివసేన ప్రయత్నాలకు చెక్..ఎన్సీపీకి గవర్నర్ పిలుపు
X

పైకి అంతా ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్నట్లు కన్పిస్తున్నా ఎవరి రాజకీయం వాళ్లు ఆడుతున్నారు. ముఖ్యంగా బిజెపి మాత్రం తన చేతికి మట్టి అంటకుండా పావులు కదుపుతోంది. ఎలాగైనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై శివసైనికుడిని కూర్చోబెడతామని గత కొన్ని రోజులుగా పదే పదే ప్రకటిస్తున్న శివసేన ప్రయత్నాలకు చెక్ పడినట్లు కన్పిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయాల్సిదిగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ శివసేనకు సోమవారం సాయంత్రం ఏడున్నర వరకూ సమయం ఇఛ్చారు. అయితే ఈ గడువులోగా శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత అయితే వ్యక్తం చేసింది కానీ..అందుకు అవసరమైన మద్దతును గవర్నర్ కు చూపించలేకపోయింది. దీంతో శివసేనకు ప్రస్తుతానికి దారులు మూసుకుపోయినట్లే కన్పిస్తోంది. వ్యూహాత్మకంగా కోశ్యారీ మూడవ అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.

అంటే ఆ పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉండాల్సి ఉంటుంది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినా..శివసేన అంగీకరించే అవకాశం లేదు. ఇది మూడు పార్టీలకు ఇరకాట పరిస్థితి. శివసేనకు ఇచ్చినట్లే గవర్నర్ ఎన్సీపీకి కూడా 24 గంటల సమయం ఇచ్చారు. మరి ఈ ఆహ్వానంపై ఎన్సీపీ ఎలా స్పందిస్తుంది. కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుంది.. శివసేన ప్లాన్స్ ఏంటి?. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అనేది ఇఫ్పుడు ఓ పెద్ద సంకటంగా మారినట్లు కన్పిస్తోంది. రాష్ట్రపతి పాలనవైపే మహారాష్ట్ర అడుగులు పడుతున్నాయనే సంకేతాలు అందుతున్నాయి. మంగళవారం నాడు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు సంయుక్తంగా లేఖలు ఇఛ్చినా శివసేన సీఎంకు గవర్నర్ అనుమతిస్తారా?. గడువు ముగిసింది కాబట్టి నో చెబుతారా? అన్నది ఆసక్తికరంగా మారనుంది.అయితే శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే తనయుడు, ఎమ్మెల్యే ఆదిత్యఠాక్రే మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధంగా ఉందని ప్రకటించారు.

Next Story
Share it