Telugu Gateway
Cinema

మహేష్ బాబు మందుకొచ్చారు..అల్లు అర్జున్ అక్కడే

మహేష్ బాబు మందుకొచ్చారు..అల్లు అర్జున్ అక్కడే
X

రెండు సినిమాలు. ఇద్దరు అగ్రహీరోలు. ఒకే తేదీని ఎంచుకున్నారు. అవే అల..వైకుంఠపురములో..సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి పందేం కోళ్ళలాగా ఇద్దరూ జనవరి 12నే ఢీ కొట్టాలని నిర్ణయించుకున్నారు. చాలా సందర్భాల్లో విడుదల తేదీల్లో సర్దుబాట్లు చేసుకున్న నిర్మాతలు ఈ సారి మాత్రం అలా మొండికేశారు. ఇలా అయితే నష్టం తప్పదని భావించిన తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ రంగంలోకి దిగింది. ఎప్పటిలాగానే సర్దుబాటు చేసింది. మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు ముందు ప్రకటించినట్లు కాకుండా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా అల..వైకుంఠపురములో మాత్రం ముందు ప్రకటించిన తేదీ జనవరి 12నే విడుదల కానుంది.

దీంతో మహేష్ బాబు సినిమా ఒక రోజు ముందుకు జరిగినట్లు అయింది. పెద్ద హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయనే విషయం తెలిసిందే. ఒకే రోజు రెండు పెద్ద సినిమాల విడుదల వల్ల నష్టం తప్పదని ఈ మేరకు సర్దుబాటు చేసుకున్నారు. సరిలేరు నీకెవ్వరూ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. అల..వైకుంఠపురములో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన పాటలు దుమ్మురేపుతున్నాయి.

Next Story
Share it