Telugu Gateway
Andhra Pradesh

ఇసుక టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించిన జగన్

ఇసుక టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించిన జగన్
X

వర్షాలు.వరదలు ఆగిపోవటంతో ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సమస్య తీరబోతోంది. సర్కారు కూడా అడిగిన వారందరికీ ఇసుక అందజేసేందుకు వీలుగా ‘ఇసుక వారోత్సవాలు’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఎక్కడికి అక్కడే ఇసుక ధర నిర్ణయించుకునేలా కలెక్టర్లకు అధికారం అప్పగించారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన కఠిన చర్యలు ప్రతిపాదిస్తూ చట్టంలో మార్పులు చేశారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే రెండు లక్షల రూపాయల జరిమానా విధించటంతోపాటు..రెండేళ్ళ పాటు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకున్నారు.

తాజాగా ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రజలు కూడా ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రారంభించింది. 14500 టోల్‌ ఫ్రీ నంబరును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు. తర్వాత టోల్‌ ఫ్రీ నంబరుకు కాల్‌ చేసి అక్కడ పనిచేస్తున్న అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాల్‌ సెంటర్‌ ఉద్యోగులకు సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్‌, టాస్క్‌ ఫోర్స్‌ చీఫ్‌ సురేంద్ర బాబు తదితరులు హాజరయ్యారు.

Next Story
Share it