ఆర్టీసీ సమ్మెపై విచారణ నవంబర్ 18కి వాయిదా

హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ మరోసారి వాయిదా పడింది. హైకోర్టు ప్రతిపాదించిన న్యాయమూర్తుల కమిటీకి సర్కారు నో చెప్పింది. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సమ్మె పరిష్కారానికి హైపవర్ కమిటీ వేయాల్సిందేనంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. ఇప్పటివరకు 27మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పిటిషనర్లు న్యాయస్థానానికి నివేదించారు. హైపవర్ కమిటీని వేసి సమస్యను పరిష్కరించాలని కోర్టును అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను గురువారానికి, కార్మికుల సమ్మెపై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తెలిపారు. ఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సమ్మె చట్టవిరుద్ధమని మీరెలా చెప్తారని ప్రశ్నించింది. ఆర్టీసీ సమ్మె వ్యవహారం హైకోర్టులో ఉన్నందున తాము లేబర్ కోర్టుకు వెళ్ళలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ఆర్ టీసీ ఏర్పాటైన కూడా దీనికి కేంద్రం అనుమతి తీసుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఏజీ మాత్రం ఇది తప్పనిసరి కాదని..రాష్ట్ర ప్రభుత్వానికి రోడ్డు రవాణాపై సర్వాధికారాలు ఉన్నాయని తెలిపారు.



