Telugu Gateway
Telangana

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X

తెలంగాణ ఆర్టీసీలో కీలక పరిణామం. కొత్తగా 5100 రూట్ల ప్రైవేటీకరణకు మార్గం సుగమం అయింది. తెలంగాణ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయానికి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూట్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై వాదనలు విన్న హైకోర్టు తాజాగా దేశమంతా ప్రైవేటీకరణ సాగుతున్న దశలో సర్కారు నిర్ణయాన్ని ఎలా తప్పుపడతామని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. హైకోర్టు నిర్ణయంతో గత 50 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికుల విషయంలో సర్కారు ఎలా స్పందిస్తుందో అన్న అంశం ఇఫ్పుడు ఆసక్తికరంగా మారింది. హైకోర్టు నిర్ణయం కార్మికులకు ఒక రకంగా షాక్ వంటిదే అని చెప్పాలి. రూట్ల ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం పొంచి ఉంది. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసినా రూట్ల ప్రైవేటీకరణ అంశం తేలాక తుది నిర్ణయం తీసుకుందామని సీఎం కెసీఆర్ ఈ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు సీఎం కెసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. గురువారం నాటి సమీక్షలో ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపడం ప్రభుత్వానికి తీవ్ర భారమని.. వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీని యథావిధిగా కొనసాగిస్తే నెలకు రూ.640కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా వేశారు. ప్రతీ నెలా ఇంత భారీగా ఆర్టీసీపై వెచ్చించడం అసాధ్యమని భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీపై రూ.5వేల కోట్ల అప్పులున్నాయని.. తక్షణం చెల్లించాల్సిన వాటిలో రూ.2వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు.

Next Story
Share it