Telugu Gateway
Cinema

రాహులో..రాహులా..బిగ్ బాస్3 విజేత

రాహులో..రాహులా..బిగ్ బాస్3 విజేత
X

అల..వైకుంఠపురములో సినిమాలోని రాములో..రాములా అన్న పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా రాహులో..రాహులా అంటూ ఫుల్ కుషీగా ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ 3 తుది విజేతగా రాహుల్ సింప్లిగంజి నిలిచాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోని ప్రవేశించిన రాహుల్ అనూహ్యంగా టైటిల్ దక్కించుకున్నాడు. ఇందులో భాగస్వాములు అయినా చాలా మంది సెలబ్రిటీలు బయటకు వచ్చి తీవ్ర విమర్శలు కూడా చేశారు. అంతే కాదు..బిగ్ బాస్ షో అంతా ఫ్రాడ్ అని..ఈ సారి ఖచ్చితంగా శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తుందని..ఎందుకంటే యాజమాన్యంతో ఆమెకు ఉన్న సత్సంబంధాలే దీనికి కారణం అంటూ తీవ్ర విమర్శలు కూడా చేశారు. అంతే బిగ్ బాస్ హౌస్ లో కూడా శ్రీముఖి చెప్పినట్లే సాగుతుందని కొంత మంది పార్టిసిపెంట్స్ ఆరోపించారు కూడా. అయితే బిగ్ బాస్ 3 విజేత శ్రీముఖి కాకుండా రాహుల్ సింప్లిగంజ్ నిలవటంతో అంతకు ముందు బిగ్ బాస్ సభ్యులు చేసిన ఆరోపణల్లో పస లేదని తేలిపోయింది. బిగ్ బాస్ 3 విజేతగా నిలిచిన రాహుల్ రూ.50 లక్షల నగదు బహుమతిని దక్కించుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతిని, బిగ్‌బాస్‌ ట్రోఫిని రాహుల్‌ అందుకున్నాడు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. తనకు ఓట్లు వేసి గెలిపించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు చేశారు.

ఈ విజయం తనను పది మెట్లు పైకి ఎక్కించాయని, ఇక నుంచి తన లైఫ్‌ కొత్తగా ఉండబోతుందని చెప్పారు. తన గెలుపు కోసం తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రేక్షకులు ఎంతో సహకరించారని రాహుల్‌ అన్నారు. తన విజయంలో పునర్నవి, వరుణ్‌, వితికల కష్టం కూడా ఉందన్నారు. పునర్నవి గురించి మాట్లాడుతూ.. ‘ఫస్ట్ నేను టాస్కులు ఆడకపోతుండే. పెద్ద లేజీగాడు లెక్కుండే. మంచిగజెప్పింది ఇన్లేదు. టాస్కులు ఆడరా అని జెప్పింది. అయినా ఇన్లేదు. అరె ఎదవ ఆడరా టాస్కులు అని జెప్పింది. అయినా ఇన్లేదు. ఒకరోజు ఫాట్ అని బైరిబెట్టింది. అయినా ఇన్లేదు. ఆఖరికి నామినేట్ జేసింది. తీస్కపోయి ముఖానికి రంగు పూసింది’ అని చెప్పాడు. టాస్క్‌ ల వల్లే శ్రీముఖికి, తనకు బేదాభిప్రాయాలు వచ్చాయి తప్ప వ్యక్తిగతంగా ఏమి లేదన్నారు. ఇక నుంచి తన లైఫ్‌ కొత్తగా మారుతుందని చెప్పారు. ‘ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో మా అమ్మనాన్న కడుపులో పుట్టాను’అంటూ రాహుల్‌ భావోద్వేగానికి గురయ్యాడు.

Next Story
Share it