Telugu Gateway
Andhra Pradesh

జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు

జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ రాజధానిని పులివెందులో పెట్టుకుంటారేమో అని ఎద్దేవా చేశారు. రాజధాని పులివెందులో..కోర్టు కర్నూలులో పెట్టుకుంటే ఆయనకు ఖర్చులు కూడా కలుసొస్తాయని ఎద్దేవా చేశారు. అదే మంత్రి బొత్స సత్యనారాయణని అడిగితే రాజధాని చీపురుపల్లిలో పెడదామని అంటారని వ్యంగాస్త్రాలు సంధించారు. విశాఖపట్నంలో జనసైనికుల సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ పతాకాన్ని గౌరవించలేని వ్యక్తికి జాతికి సేవ చేసిన వారి విలువ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి నాకేం తెలియదు అంటూ మాట మార్చారన్నారు. దేశానికి మిసైల్ పరిజ్ఞానం ఇచ్చిన మహనీయులు కలామ్. ఆయన పేరిట ఉన్న పురస్కారానికి ముఖ్యమంత్రి తన తండ్రి వైఎస్ఆర్ పేరు ఎలా పెడతారు.

మీ నాన్నపేరు చాలా పథకాలకు పెట్టారు కదా. కావాలంటే కొత్త పథకాలకు పెట్టుకోండి. మీ నాన్న పేరు, మీ అమ్మ పేర్లు పెట్టుకోవడమేనా? ప్రకాశం పంతులుగారు లాంటి గొప్పవారి పేర్లు లేవా పెట్టడానికి. జీవోపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి నాకేం తెలియదు అంటున్నారు. అంటే ఎవరికివాళ్ళే ఇష్టానుసారం పని చేసేస్తున్నారా? మీరు చెప్పే మాటల్లో నిజంగా నిబద్దత ఉంటే జీవో ఇచ్చిన వారిని తక్షణం సస్పెండ్ చేయండి అని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ వేల కోట్లు కుంభకోణాలతో కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఎవరూ అడిగే వారు ఉండరు. కానీ పవన్ రాజకీయాల్లో ఉంటాడా., సినిమాల్లోకి వెళ్లిపోతాడా అనేది మాత్రం అడుగుతారు. మనకి డిఫెండ్ చేసుకునే దమ్ము లేదు. నా చుట్టూ ఉన్న వాళ్లే నన్ను ప్రశ్నిస్తుంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదు. వాళ్లు అన్ని తప్పులు చేసి డిఫెండ్ చేసుకుంటున్నారు. నేను మీ కోసం పోరాడుతుంటే కనీసం నా కోసం గొంతు కూడా ఎత్తకపోతే ఎలా… అనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్నా అంతా వ్యాపారాలు చేసుకోవడం లేదా?.

భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ జగన్ రెడ్డికి లేవా, కాంట్రాక్టులు, పాల పరిశ్రమలు లేవా? వ్యాపారాలు లేని వారు ఎంత మంది ఉన్నారు. అంతా పూర్తిగా రాజకీయాలే చేస్తున్నారా? నాకు వ్యాపారాలు చేయాలని ఉన్నా నేను మీలా గడ్డి తినలేను. పవన్ కళ్యాణ్ 100 కోట్లు సంపాదించాలి అంటే సినిమాలు చేస్తే వస్తాయి. మన ప్రత్యర్ధులు ఎవరైనా డబ్బు సంపాదించాలి అంటే కంపెనీలకు సంతకాలు పెట్టాలి. పవన్ కు మాత్రం ఆ కర్మ లేదు. అవకతవకలు చేయగా వచ్చిన పెట్టుబడులతో వారు వ్యాపారాలు చేస్తూ మనల్ని వెటకారాలు చేస్తున్నారు. బీ టీం అనీ... మరోటీ అని అంటున్నారు. మీరంతా మాట్లాడండి. ఎదురు తిరగండి విమర్శలను గట్టిగా తిప్పికొట్టండి. మీరు భయపడితే మనల్ని బతకనివ్వరు. నేను పార్టీ పెట్టిందే సమాజంలో ధైర్యం నింపడానికి. ఎవరో రాజకీయ నాయకులు, గూండాలు వచ్చి మన స్థలాలు లాక్కుపోతూ ఉంటే మనం భయపడతామా? మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏమిటి? తెగించేవాడే సమాజానికి కావాలి. ఇన్ని కేసులు ఉన్న మీరే తెగించి తిరుగుతుంటే ఆశయాల కోసం వచ్చిన మేం తెగించమని ఎందుకు అనుకుంటున్నారు. మీరు మాట్లాడితే మేం మాట్లాడలేమా? నేను ఓటమితో కుంగిపోతా అనుకున్నారు.

నేను చాలా మొండివాడిని. ఒక భావజాలాన్ని నమ్మి ముందుకు వెళ్లే వారికి వచ్చే శక్తి వేరే ఉంటుంది. ఓ పర్వతాన్ని ఢీ కొట్టే శక్తి వస్తుంది. 151 మంది మనకి ఓ లెక్కా? పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయాలి తప్ప, కొన్నికుటుంబాల కోసం కాదు. జనసేన పార్టీ చేపట్టిన లాంగ్ మార్చ్ ను విఫలం చేయడానికి చాలామంది కుయుక్తులు పన్నారు. రకరకాల రూమర్లు సృష్టించారు. కానీ జనసైనికుల నిస్వార్ధమైన శ్రమ, క్రమశిక్షణ వల్ల కార్యక్రమం విజయవంతమైంది. లాంగ్ మార్చ్ కు ముందు రోజు వేదిక నిర్మించకుండా కొంతమంది అధికారులు అడ్డంకులు సృష్టిస్తే, ఆడపడుచులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు వేదిక వద్దే కూర్చొని అధికారులను అడ్డుకున్నారు. భీమవరం నుంచి వచ్చిన కొంతమంది జనసైనికులు దాదాపు 10 వేల మందికి టీ, బిస్కెట్లు ఉచితంగా అందించారు. ఇలాంటి కమిట్ మెంట్ ఉన్న వ్యక్తుల వల్లే లాంగ్ మార్చ్ వంటి భారీ కార్యక్రమం విజయవంతమైంది. పార్టీపైన, అధ్యక్షుల పైన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. అంటువంటి ప్రచారంపై తిరగబడాలి. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి వచ్చిన ఆయన ఆశయాలకు అనుగుణంగా జనసైనికులు పని చేయాలి. విభేదాలను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కష్టపడి పార్టీ విజయం కోసం కృషి చేయాల”ని పిలుపునిచ్చారు.

Next Story
Share it