Telugu Gateway
Andhra Pradesh

మాతృభాషను విస్మరిస్తే మట్టిలో కలుస్తారు..పవన్

మాతృభాషను విస్మరిస్తే మట్టిలో కలుస్తారు..పవన్
X

వైసీపీ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎవరైనా సరే మాతృభాషను విస్మరిస్తే మట్టిలో కలుస్తారని హెచ్చరించారు. ఇంగ్లీష్ కు తాము వ్యతిరేకం కాదని..స్కూల్ లో ఒక్క విద్యార్ధి తెలుగు మాధ్యమంలో విద్యకు ఆసక్తి చూపితే అతనికి అవకాశం ఉండాల్సిందే అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి దాంట్లోనూ రాజకీయాలు వస్తాయని విమర్శించారు. తెలుగు బాష పరిరక్షణ కోసం మేధావులు, నిపుణులు భయం వీడి బయటకు రావాలని పిలుపునిచ్చారు. హిందీని జాతీయ భాష చేస్తామని ప్రకటించటంతో తమిళనాడు మొత్తం ఒక్కటైందని..రాజకీయ విభేదాలను పక్కన పెట్టి మరీ తమిళనాడులో పోరాడారని..అందుకే కేంద్రం వెనక్కి తగ్గిందని తెలిపారు. తెలుగు భాషను చంపుకోవటం అంటే మన ఉనికిని చంపుకోవటమే అన్నారు. విజయవాడలో విశాలాంధ్ర బుక్ హౌస్ సందర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే జనసేన మరో ప్రకటన విడుదల చేసింది. అందులో జనసేన విధానాన్ని ప్రకటించారు. ఎల్.కె.జి. నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమంలో చదువుకునే వెసులుబాటు ఇవ్వటమే జనసేన పార్టీ విధానం అని తెలిపారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు విజయవాడలో పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే దిశగా వైసిపి ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో మాతృ భాషను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... "ఎల్.కె.జి. నుంచి పీజీ వరకు మాతృ భాషలో బోధన ఎలా అనే అంశంపై పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. జనసేన ప్రభుత్వం వచ్చాక కేజీ నుంచి పీజీ వరకూ తెలుగు మాధ్యమంలో చదివే వారికి రుసుములు ప్రభుత్వమే చెల్లించే విధానం తెస్తాం.

కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ 2019 జాతీయ విద్యా విధానానికి సంబంధించిన ముసాయిదాను డాక్టర్ రమేష్ బాబు మా దృష్టికి తీసుకువచ్చారు. ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాతృ భాషలోనే బోధన చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేసేలోపే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇంగ్లీష్ లో బోధన చేయాలనే విధానాన్ని తీసుకువచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష విషయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. తెలుగు భాష మీద మక్కువతో రమేష్ బాబు రెండు దశాబ్దాలుగా అమ్మనుడి అనే పత్రికను నడుపుతున్నారు. తెలుగు మాధ్యమ బోధనలో ఎలాంటి మార్పులు చేస్తే మంచి మార్పులు వస్తాయి అనే అంశంపై కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. పాఠశాలల్లో ఓ ఆహ్లాదకరమైన వాతారణంలో తెలుగు బోధన జరిపేలా చర్యలు తీసుకుంటాం" అని అన్నారు.

Next Story
Share it