ప్రభుత్వ విధానాల వల్లే ఇసుక సమస్య
ఏపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గత ప్రభుత్వ ఇసుక విధానంపై ఎన్నో విమర్శలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం ఇసుక సరఫరా ఆపేశారని అన్నారు. జనసేన విశాఖపట్నంలో ఆదివారం నాడు తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మనోహర్ శనివారం నాడు విశాఖపట్నంలో పార్టీ నేతలు వి వి లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ లతో కలసి మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం ముందు చూపులేకుండా వ్యవహరించటం వల్ల ఏపీలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఉపాధి లేక ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు లేవన్నారు. ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి బాధితులకు న్యాయం చేసేందుకే జనసేన ఈ కార్యక్రమం తలపెట్టిందని మనోహర్ వివరించారు. ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.