Telugu Gateway
Politics

మహారాష్ట్ర ఎపిసోడ్...సుప్రీం తీర్పు మంగళవారం

మహారాష్ట్ర ఎపిసోడ్...సుప్రీం తీర్పు మంగళవారం
X

మహా ‘ రాజకీయ డ్రామా’ కొనసాగుతోంది. ఎవరికి వారు బలం మాది అంటే మాది అని చెబుతున్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత..సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఎపిసోడ్ పై సోమవారం నాడు వాదనలు జరిగాయి. తక్షణమే ఫడ్నవీస్ బలనిరూపణకు ఆదేశించాలని ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ దాఖలు చేసిన పిటీషన్లపై వాదనలు ముగియగా..తుది తీర్పును మంగళవారం ఉదయం పదిన్నరకు వెల్లడించనున్నట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. దీంతో ఫడ్నవీస్ సర్కారుకు మరో 24 గంటల పాటు వెసులుబాటు లభించినట్లు అయింది. అంతకు ముందు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి.

ఉదయం 5 గంటకు రాష్ట్రపతి పాలన ఎత్తేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీల తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందాలను విస్మరించిన కారణంగానే పొత్తులు చెడిపోయాయనీ... సిద్ధాంత పరంగానూ విబేధాలు ఉన్నాయన్నారు. తమకు మద్దతుగా 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనీ.. దీని తాలూకు అఫిడవిట్లు సైతం తమతో ఉన్నాయంటూ సిబల్ పేర్కొన్నారు. ఈ 154 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు పరిగణనలోకి తీసుకుని 24 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని ఆయన సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. సభలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించి, ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో బలపరీక్ష నిర్వహించాలని ఆయన కోరారు.

బల పరీక్ష ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేయాలని అభ్యర్థించారు. అయితే రాష్ట్రపతి పాలన ఎత్తివేత అంశంపై తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సదరు 154 మంది ఎమ్మెల్యే అఫిడవిట్లు తీసుకునేందుకు కూడా నిరాకరించింది. పిటిషన్లను ఇంతకు మించి పొడిగించవద్దని ధర్మాసనం సూచించడంతో... వీటిని ఉపసంహరించుకుంటున్నట్టు అభిషేక్ సింఘ్వీ తెలిపారు. మంగళవారమే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలంటూ సింఘ్వీ సైతం సుప్రీంకోర్టును కోరారు. బీజేపీ తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తాము గవర్నర్‌ వద్దకు వెళ్లామని, తమ వైపు ఒక పవార్‌.. వాళ్ల వైపు మరో పవార్ ఉన్నారని రోహత్గీ చెప్పారు. అయితే వాదనలు విన్న సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. మెజార్టీని నిర్ణయించేది రాజ్‌భవన్ కాదని, శాసనసభ మాత్రమేనని కోర్టు వ్యాఖ్యానించింది.

Next Story
Share it