Telugu Gateway
Andhra Pradesh

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కూడా ఉండాల్సిందే

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కూడా ఉండాల్సిందే
X

ఏపీ సర్కారు తొందరపాటు నిర్ణయాల వల్ల ఒక తరం నష్టపోయే ప్రమాదం కన్పిస్తోందని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. ఆంగ్ల మాధ్యమానికి జనసేన వ్యతిరేకం కాదని..అదే సమయంలో దీన్ని బలవంతంగా రుద్దాలని ప్రయత్నించటం సమర్ధనీయం కాదని పేర్కొంది. సోమవారం నాడు హైదరాబాద్ లో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పలువురు నేతలు పాల్గొన్నారు. పీఏసీ సమావేశం వివరాలను ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 95 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా ప్రభుత్వం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు ఒక తరానికి అన్యాయం చేసే విధంగా ఉన్నాయని చెప్పారు. "పీఏసీ సమావేశంలో ప్రధానంగా ఆరు అంశాలపై చర్చించాం. ఇప్పటికీ ఇసుక సరఫరాలో అవకతవకలు జరగుతున్నాయని పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి.

జిల్లాల్లో జరుగుతున్న ఇసుక అవకతవకలపై జనసేన పార్టీ నాయకులు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్క జన సైనికుడు ఇసుక రవాణా సరిగా జరుగుతుందా..? లేదా..?. సామాన్యుడికి ఇసుక చేరుతుందా..? లేదా..? అన్నదానిపై ఓ కన్నేసి ఉంచాలి. సమాచారం సేకరించి పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకొస్తే అవకతవకలపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తాం. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంపై మరింత ఉంది. మన సంస్కృతి, సంప్రదాయాలు భావి తరాలకు అందించాలంటే మాతృభాషను కాపాడుకోవడం చాలా అవసరం. దీనిపై జనసేన పార్టీ తరపున స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో రెండు మాధ్యమాలకు అవకాశం కల్పించాలి.

తెలుగు మాధ్యమంలో చదవడానికి ఒక్క విద్యార్ధి సిద్ధంగా ఉన్నా సరే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ విద్యార్ధిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని పిఏసీ సమావేశం తీర్మానించింది. అలా కాకుండా ప్రభుత్వం మొండిగా ముందడుగు వేస్తే అన్ని పార్టీలను కలుపుకొని తెలుగు భాష పరిరక్షణ కోసం పోరాటం చేస్తాం.’ అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 49 నదులున్నాయి. ఆ నదులకు గత వైభవం తీసుకొచ్చే విధంగా గొప్ప కార్యక్రమం రూపొందించింది. ఆ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రజల్లోకి తీసుకెళ్తాం. పార్టీ సంస్థగత నిర్మాణంపై దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నిర్దిష్ట మార్గదర్శకాలు ఇచ్చాం. డిసెంబర్ 15వ తేదీ కల్లా మండల, పట్టణ కమిటీలను పూర్తి చేసి ఆ ప్రతిపాదనలు పార్టీ కార్యాలయానికి పంపించాలని నియోజకవర్గ ఇంచార్జులను కోరాం. అలాగే త్వరలోనే పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తారు. ఏ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

Next Story
Share it