Telugu Gateway
Andhra Pradesh

తప్పులేమీ చేయకపోయినా తప్పుపడుతున్నారు

తప్పులేమీ చేయకపోయినా తప్పుపడుతున్నారు
X

గత ఐదు నెలల పాలనలో తాను తప్పులు ఏమీ చేయకపోయినా విపక్షాలు ప్రతి అంశాన్ని తప్పుపడుతూ విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇంగ్లీష్ విద్య దగ్గర నుంచి ప్రతి అంశం రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. వాళ్ల పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదువుకోవాలి..పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదువుకోవాలా? అని ప్రశ్నించారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళకు..డ్రైవర్లు..ఇతర చిన్న ఉద్యోగాలు పేదల పిల్లలకా? అన్నారు. పేదల పిల్లలు కూడా టై కట్టుకుని స్కూల్ కు వెళ్ళాలని..కారులో ఉద్యోగాలకు పోయే స్థితికి చేరాలన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం నాడు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం 10 వేల రూపాయలు అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించడానికి బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించినట్ల సీఎం వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘గంగపుత్రులకు ఇచ్చిన వాగ్ధానానికి కట్టుబడి ఉన్నాను. వేట నిషేధ సమయంలో ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి రూ. 10 సాయంగా అందిస్తున్నాం. అది నేటి నుంచే శ్రీకారం చుడుతున్నాం. మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో తిరిగి ఇంటికి వస్తారన్న భరోసా కూడా లేదు.

సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి మత్సకార భరోసా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. ఎస్సీ, బీసీ, ఎస్టీలకు నామినేటేడ్‌ పదవులు, పనుల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాం. అలాగే మహిళలకూ రిజర్వేషన్లు కల్పించాం. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం. నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టబోతున్నాం. పిల్లలంతా ఉన్నత చదువులు చదవాలి. అలాగే పేదలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఆస్పత్రులను కూడా మెరుగుపరుస్తున్నాం. ఎంతమంది శత్రువులు నాపై కుట్ర పన్నినా.. వారందరినీ ఎదుర్కొనే శక్తి నాకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షం ఓర్వేట్లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో మరింత ముందుకు సాగుతా’ అని అన్నారు.

Next Story
Share it