Telugu Gateway
Andhra Pradesh

జగన్ ‘పట్టుకోలేకపోయారా...పట్టించుకోవటం లేదా?!

జగన్ ‘పట్టుకోలేకపోయారా...పట్టించుకోవటం లేదా?!
X

45 రోజుల్లో కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఎక్కడ?

విద్యుత్ ఒప్పందాల నష్టం రికవరి సాధ్యం అవుతుందా?

కాగ్ తేల్చిన పట్టిసీమ నివేదికపైనా చర్యలు శూన్యమేనా?

ప్రతిపక్షంలో ఓ మాట..అధికారంలోకి వచ్చాక ఓ మాట

‘గత ప్రభుత్వ అక్రమాలను 45 రోజుల్లో నిగ్గుతేలుస్తాం. దీని కోసం మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. 30 అంశాలపై సబ్ కమిటీ లోతుగా దృష్టి సారిస్తుంది. ఆ తర్వాత చర్యలు ఉంటాయి. మంత్రుల కమిటీ తన నివేదికను 45 రోజుల్లో అందజేస్తుంది’ ఇదీ జూన్ 30న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు గంటల సమీక్ష తర్వాత వెల్లడించిన అంశాలు. జగన్ తన నిర్ణయం ప్రకటించి 45 రోజులు ఎప్పుడో దాటిపోయింది. 45 రోజులు కాదు కదా...దగ్గర దగ్గర 145 రోజులు కావస్తున్నా కేబినెట్ సబ్ కమిటీ నివేదిక అతీగతీ లేదు. అసలు ఇంత వరకూ ఈ కమిటీ ఏమి తేల్చిందో కూడా ఎవరికీ తెలియదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో గత ప్రభుత్వ అక్రమాలు అన్నింటిని వెలికితీస్తామని..అసలు అవినీతిని సహించేదిలేదని ప్రకటించారు. అధికార వర్గాల్లో కూడా ఈ అంశంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సీఎం జగన్ పట్టుకోలేకపోయారా?. లేక వేరే కారణాలతో పట్టించుకోవటం మానేశారా? అన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

ఒక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా విజిలెన్స్ విచారణకు మాత్రం ఆదేశించారు. మిగిలిన ఏ అంశంలోనూ నిర్దిష్ట చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అమరావతి ప్రాజెక్టులో అయితే ఎక్కడ చూసినా అవినీతే అన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలను సర్కారు బహిర్గతం చేయలేదు. జగన్ గత ప్రభుత్వ అక్రమాలనను నిగ్గుతేల్చేందుకు సబ్ కమిటీ ఏర్పాటు అంశంపై సమీక్ష చేసిన తరుణంలో నాలుగు రోజులకు ఒక సారి కేబినెట్ సబ్ కమిటీ కూర్చుంటుందని..పదిహేను రోజులకు ఓ సారి తాను కూడా సమీక్ష చేస్తానని ప్రకటించారు. ఆ దిశగా సమావేశాలు జరిగిన దాఖలాలు లేవని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతోపాటు విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని..దీని ద్వారా 2000 కోట్లపై భారం పడిందని తొలుత ఆదరబాదరా ప్రకటించారు. ఈ మొత్తాన్ని రికవరీ కూడా చేస్తామన్నారు. కానీ ఇది కూడా తుస్ అన్నట్లే కన్పిస్తోంది. ఈ విద్యుత్ ఒప్పందాల వ్యవహారం రాష్ట్రంలోనే కాకుండా..ఏకంగా ఇది కేంద్రం మెడకు చుట్టుకుంది. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఏకంగా చంద్రబాబు హయాంలో ఐదు లక్షల కోట్ల రూపాయలు అక్రమాలు కుంభకోణాలు జరిగాయని ఓ పుస్తకాన్నే ప్రచురించింది.

అదే నిజం అయితే ఆ పుస్తకం ముందు పెట్టుకుని చకచకా నిజాలు నిగ్గుతేల్చాలి కదా?. కానీ అదేమీ జరగటం లేదు. చంద్రబాబునాయుడు కూడా ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ హయాంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని..తాము అధికారంలోకి వస్తే రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆ మొత్తం వెనక్కి తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. అదికారంలోకి వచ్చారు వెళ్ళారు..చేసింది ఏమైనా ఉందా అంటే కనీసం పది రూపాయలు కూడా రికవరీ చేయలేదు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. మరి వైసీపీ చెప్పిన ఐదు లక్షల కోట్ల రూపాయల పుస్తకంలో అవినీతిని ఏ మేరకు తేలుస్తారో వేచిచూడాల్సిందే. సాక్ష్యాత్తూ అసెంబ్లీలోనే జగన్, ప్రస్తుత ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పట్టిసీమలో అవినీతి జరిగిందని పదే పదే ఆరోపించారు. మరి అధికారంలోకి వచ్చాక కాగ్ నివేదిక చేతిలో ఉన్నా ఇప్పుడు ఏమీ చేయటం లేదు. పైగా అక్రమాలు చేసిందని ఆరోపించిన మెఘా సంస్థకు నిబంధనలకకు విరుద్ధంగా పోలవరం పనులు కూడా కట్టబెట్టారు. అంటే అధికారంలో ఉంటే ఒక మాట..ప్రతిపక్షంలో ఉంటే మరో మాట. ఈ విషయంలో నేతలు ఎవరికీ పెద్ద తేడాలు ఉండవేమో.

Next Story
Share it