మోడీ మాటలపై వైసీపీ ఏమంటుందో..పవన్
జనసేన అధికార వైసీపీపై విమర్శల విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. అందులో ఆయన ముఖ్యంగా ‘అమ్మభాషను విస్మరిస్తే అభివృద్ధి అసాధ్యం’ అని వ్యాఖ్యానించారు. ప్రతి మనిషి సొంత భాషను..యాసను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చే ఏడాది నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తేసి..ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టనుంది. అయితే తెలుగు ఓ సబ్జెక్ట్ గా మాత్రమే ఉండబోతోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్కారు నిర్ణయంతో తీవ్రంగా విభేదిస్తున్నారు. కనీసం ఐదవ తరగతి వరకూ అయినా తెలుగు భాషలోనే పాఠ్యాంశాలు ఉండాలని చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటిని వైసీపీ సర్కారు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. తాజాగా అమ్మ భాషకు సంబంధించి ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేయటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. పత్రికల్లో ఈ అంశంపై వచ్చిన వార్తలను జత చేసి..దీనిపై సీఎం జగన్ తోపాటు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని వ్యాఖ్యానించారు.
దీంతోపాటు మరో అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ప్రస్తావించారు. ‘పౌరహక్కుల సంఘం’ రాసిన ‘కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం’ పుస్తకంలో సీఎం వైఎస్ జగన్ ప్రస్తావన ఉన్న ఓ పేజీని జనసేన పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘1996లో పౌరహక్కుల సంఘం ప్రచురించిన ఈ పుస్తకంలో, అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది ‘రాయలసీమలోనే.. కర్నూలులోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని, 14 ఏళ్ల ‘సుగాలి ప్రీతి’ ఉదంతమే దానికి ఉదాహరణ. అలాగే ఈ పుస్తకంలో 75వ పేజీలో జగన్ రెడ్డి ప్రస్తావన కూడా ఉంటుంది’ అని ఆ పేజీని జనసేన ట్విట్టర్‌లో జతచేసింది.