బాబోయే..ప్రవీణ్ ప్రకాష్ దగ్గర పనిచేయలేను..తప్పించండి
సీఎస్ కు కేబినెట్ అదనపు కార్యదర్శి గురుమూర్తి లేఖ
ఏపీ అధికార వ్యవస్థలో ఏమి జరుగుతోంది. ఓ వైపు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం, జీఎడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ల మధ్య విభేదాలు. తాజాగా మరో కీలక అధికారి ఏకంగా ప్రవీణ్ ప్రకాష్ పై ఫిర్యాదు చేస్తూ సీఎస్ కు లేఖ రాయటం కలకలం రేపుతోంది. అత్యంత కీలకమైన ఏపీ కేబినెట్ విభాగంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న కె. గురుమూర్తి సీఎస్ కు చేసిన వినతి ఆశ్చర్యకరంగా ఉంది. ప్రవీష్ ప్రకాష్ దగ్గర తాను పనిచేయలేనని..తనను వేరే శాఖకు మార్చాలని ఆయన సీఎస్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు. దీంతోపాటు పలు అంశాలను గురుమూర్తి తన లేఖలో పేర్కొనటం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రవీష్ ప్రకాష్ సరైన రీతిలో విషయాలను కమ్యూనికేట్ చేయకపోవటంతోపాటు..ప్రతి పనినీ వాయిదా వేస్తూ జాప్యం చేసే విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు.అంతే కాదు ఆయన తప్పులను ఇతరుల మీద తోసి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. తన తప్పేమీ లేకపోయిన ఇతరుల ముందు ఎన్నోసార్లు తనను అవమానించారని..తాను కూడా ఆయనలాగే 1993లో సివిల్ సర్వీసెస్ క్లియర్ చేశానని సీఎస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ఈ వయస్సులో ఆయన దగ్గర తిట్లు తినటం భరించలేని విధంగా ఉందన్నారు. ఈ విషయాలు అన్నీ గమనంలోకి తీసుకుని తనను అక్కడ నుంచి ఇతర శాఖకు మార్చాలని తన లేఖలో సీఎస్ ను కోరారు. ప్రభుత్వాధికారులందరికీ హెడ్ అయిన సీఎస్ కు, మరో వైపు సీఎంవోలోని ఉన్నతాధికారుల మధ్య విభేదాలు కోల్డ్ వార్ స్థాయికి చేరాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎంతో సమన్వయంతో కలసి పనిచేయాల్సిన అధికారుల మధ్య నెలకొన్న వివాదాలు ఎటువైపు వెళతాయో అన్న టెన్షన్ తో ఇతర అధికారులు ఉన్నారు. మధ్యలో గురుమూర్తి లేఖ వ్యవహారం వెలుగుచూడటం మరింత దుమారం రేపుతోంది.