Telugu Gateway
Politics

హైదరాబాద్..దేశ రెండవ రాజధాని

హైదరాబాద్..దేశ రెండవ రాజధాని
X

ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న అంశం. అప్పుడప్పుడు అలా తెరపైకి వచ్చి ఇలా తెరమరుగు అవుతూ ఉంటుంది. కానీ ఈ సారి ఈ చర్చను లేవనెత్తింది బిజెపి సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కావటం విశేషం. దేశ రాజధాని ఢిల్లీని ప్రస్తుతం కాలుష్యం కమ్మేసింది. అక్కడ గాలి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ తరుణంలో హైదరాబాద్ ను దేశ రెండవ రాజధానిగా చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో అంబేద్కర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు.

అయితే అన్ని రాజకీయ పార్టీలు కలసి ఈ విషయంపై ముందుకెళితేనే అది సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలన్న చర్చ పార్లమెంట్ ఎన్నికల సమయంలో వచ్చిందని ఆయన తెలిపారు. కానీ ఇప్పటి వరకు కేంద్రంలో, పార్టీలో కానీ దీనిపై చర్చ జరగలేదన్నారు. రెండో రాజధాని కోసం అన్ని పార్టీలను లీడ్ చేసే ఉద్దేశం తనకు లేదని ఆయన తెలిపారు. ఈ అంశంపై విద్యాసాగర రావు మంగళవారం నాడు పలు మీడియా ఛానళ్లతో మాట్లాడారు.

Next Story
Share it