Telugu Gateway
Andhra Pradesh

ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
X

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం బుధవారం నాడు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరవ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అదే సమయంలో ఇసుకకు సంబంధించిన అంశంపై కూడా మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక ఎవరైనా అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారణ అయితే రెండు లక్షల రూపాయల జరిమానా విధించటంతోపాటు..రెండేళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించనున్నారు. ఈ మేరకు మంత్రివర్గంలో చట్ట సవరణ చేసినట్లు తెలిపారు. మంత్రివర్గ సమావేశం వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. ఏపీలో మార్కెట్ కమిటీలు..ఆలయ పాలక మండళ్ళ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదే సమయంలో పాలక మండళ్ళలో 50 శాతం రిజర్వేషన్ ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు జగన్.

మొక్కజొన్న ధరలు పడిపోతుండటంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వారం రోజుల క్రితం మొక్కజొన్న క్వింటాలు ధర రూ.2200 ఉండేదని.. ఇప్పుడు రూ.1500కు పడిపోయిందని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర రూ.1750 కూడా రావడం లేదని మంత్రివర్గం వద్ద ప్రస్తావించారు. ఈ క్రమంలో రైతులు నష్టపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీచేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైతులకు నష్టం రాకుండా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వ్యర్ధాల నిర్వహణ కోసం కొత్తగా పర్యావరణ నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Next Story
Share it