Telugu Gateway
Politics

కెసీఆర్ కు చెంచాలుగా మారిపోయారు

కెసీఆర్ కు చెంచాలుగా మారిపోయారు
X

కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్టీసీ సమ్మెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మెను బలహీనుడికి.. బలవంతునికి జరుగుతున్న పోరాటంగా ఆయన అభివర్ణించారు. భగవంతుడు ఎవరిని గెలిపిస్తాడో చూద్దామన్నారు. ఇటీవల వరకూ సీఎం కెసీఆర్ అనుకూలంగా పలు ప్రకటనలు చేసిన జగ్గారెడ్డి తాజాగా సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేయటం విశేషం. ‘ఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు ఎక్కడా కనపడటం లేదు. కేవలం సీఎం కేసీఆర్ మాటలను బలపరుస్తున్నారు. స్వామిగౌడ్ , మమత, రవీందర్, దేవీప్రసాద్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యపై మాట్లాడకుండా ప్రభుత్వానికి చెంచా గిరి చేసుకుంటూ బతుకుతున్నారు. రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా... గుండెపోటు తెలంగాణాగా మారిపోయింది. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి. ’ అని జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు.

రాష్ట్రంలో ఉద్యమాలకు విలువ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కళ్లున్నా చూడలేని గుడ్డి ప్రభుత్వం ఇది అని సర్కారుపై ధ్వజమెత్తారు. 40 రోజులు ఆర్టీసీ సమ్మె జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ‘ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. తక్కువ జీతాలు ఉన్న ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నారని.. ఈరోజు కూడా ఆవుల నరేశ్‌ అనే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. ‘తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పలు సందర్భాలలో మాట్లాడారు. మరి ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఒకవైపు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు మరోవైపు. ప్రభుత్వానికి కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా’ అని ప్రశ్నించారు.

Next Story
Share it