Telugu Gateway
Politics

ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1న కెసీఆర్ భేటీ

ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1న  కెసీఆర్ భేటీ
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తాను ప్రకటించినట్లుగానే ఆర్టీసీ కార్మికులతో సమావేశం ఏర్పాటుకు రెడీ అయ్యారు. డిసెంబర్ 1న ఆయన రాష్ట్రంలోని అన్ని డిపోల కార్మికుల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేసేందుకు కెసీఆర్ రంగం సిద్ధం చేసినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. మరో వైపు గుర్తింపు పొందిన కార్మిక సంఘాల కార్యాలయాలకు కూడా ఆర్టీసీ అధికారులు తాళాలు వేశారు. దీంతో ఆర్టీసీలో ప్రధాన యూనియన్లు అన్నింటికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1 ఆదివారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండిని సిఎం ఆదేశించారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులు ఉండాలని, అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సిఎం కోరారు. ప్రగతి భవన్ లోనే మద్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని సిఎం చెప్పారు. మద్యాహ్న భోజనం అనంతరం కార్మికులతో ముఖ్యమంత్రి, రవాణా మంత్రి అజయ్ కుమార్ నేరుగా మాట్లాడతారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను సమగ్రంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ, ఈ.డి.లు, ఆర్.ఎం.లు, డివిఎంలను ఆహ్వానించారు.

Next Story
Share it