Telugu Gateway
Politics

ఆర్టీసి కార్మికులకు ‘కెసీఆర్ డెడ్ లైన్’

ఆర్టీసి కార్మికులకు ‘కెసీఆర్ డెడ్ లైన్’
X

తెలంగాణ ఆర్టీసి కార్మికులకు ముఖ్యమంత్రి కెసీఆర్ తుది గడువు ఇఛ్చారు. నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరితే చేరినట్లు..లేదంటే లేదని స్పష్టం చేశారు. ఆర్టీసి కార్మికులకు అన్యాయం చేయాలని..వారి పొట్టకొట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అన్నారు. ఈ విషయంలో ఆర్టీసి కార్మికుల కుటుంబాలు..బంధువులు కూడా ఆలోచించుకోవాలని అన్నారు. తెలంగాణాలో కొత్తగా 5100 ప్రయివేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్టీసి కార్మికులు 5వ తేదీ రాత్రికి కూడా విధుల్లో చేరకపోతే మిగిలిన రూట్లలో కూడా ప్రైవేట్ వాళ్ళకు పర్మిట్లు ఇస్తామని స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త రవాణా చట్టం ప్రకారమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అదే సమయంలో లాభాలు వచ్చే రూట్లను ప్రైవేట్ వాళ్లకు ఇస్తారనే ప్రచారం జరుగుతోందని..అలాంటిది కూడా ఏమీ ఉండదని తెలిపారు. నష్టాలు వచ్చే రూట్లతో పాటు పల్లె వెలుగు రూట్లను కూడా ప్రైవేట్ వాళ్లకు ఇస్తామని అన్నారు.

అదే సమయంలో ప్రైవేట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు వసూలు చేయటానికి ఛాన్స్ ఉండదని..ఛార్జీల నియంత్రణకు ఓ నియంత్రణా కమిటీ ఉంటుందని తెలిపారు. అదే సమయంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని పాస్ లు కూడా రాబోయే రోజుల్లో ఉంటాయని తెలిపారు. ఆర్టీసి కార్మికుల ఆత్మహత్యలకు యూనియన్ నేతలు..కొన్ని ప్రతిపక్షాలే కారణం అని కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసి కార్మిక నాయకులు అసంబద్ధమైన..అర్ధరహితమైన వాదనలతో కార్మికులను అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఖచ్చితంగా ఆర్టీసీ సమ్మె చట్టవ్యతిరేకం అని కెసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. కొత్తగా 5100 రూట్లకు పర్మిషన్ ఇవ్వాలనేది తన వ్యక్తిగత నిర్ణయం కాదని..కేబినెట్ ఏకగ్రీవ నిర్ణయం అని తెలిపారు. కార్మికుల విధుల్లో చేరకపోతే మిగిలిన రూట్లు కూడా వెళ్ళిపోతాయని అన్నారు.

Next Story
Share it