Telugu Gateway
Andhra Pradesh

ఆరు నెలల్లో చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా ఔట్!?

ఆరు నెలల్లో చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా ఔట్!?
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరు నెలల వ్యవధిలోనే ప్రతిపక్ష నేత హోదాను కోల్పోబోతున్నారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇదే దిశగా ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే అంతర్గతంగా దీనికి సంబంధించిన కసరత్తు పక్కాగా సాగుతోంది. అయితే రాజకీయ విమర్శలు రాకుండా అత్యంత పకడ్భందీగా ఈ వ్యవహరం నడుస్తోంది. ఓ వైపు అధికార వైసీపీతోపాటు..మరో వైపు బిజెపి కూడా ఏపీలో టీడీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ ఉన్నంత కాలం తమకు ‘స్సేస్’ దొరకదనే భావనలో ఉన్న బిజెపి నయానో..భయానో ఆ పార్టీ నేతలను తమ వైపు తిప్పుకుంటోంది. మరో వైపు అధికార వైసీపీ కూడా చంద్రబాబును మరింత బలహీనం చేయటం ద్వారా ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరం జరిగారు.

వాస్తవానికి ఆయన ఇప్పటికే వైసీపీలో చేరాల్సి ఉన్నా అది రకరకాల కారణాలతో ఆగిపోయింది. మరో వైపు సీనియర్ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జంపింగ్ కూడా ఖాయం అయినట్లు కన్పిస్తోంది. అయితే ఆయన వైసీపీ వైపు కాకుండా బిజెపి వైపు చూస్తున్నారు. వైసీపీ మరి కొంత మంది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే టీడీఎల్పీలో చీలిక తెచ్చి ప్రత్యేక గ్రూపుగా ఏర్పాటు అయ్యేంత సంఖ్యలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా? లేక తమ వైపు తిప్పుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మళ్ళీ గెలిపించుకుంటారా? అన్న అంశంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఫిరాయింపులకు సిద్ధంగా ఉండే వారి సంఖ్యతోపాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.

అయితే అధికార వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి రాష్ట్రంలో ఉప ఎన్నికలకు కారణం అయితే మాత్రం టీడీపీ చేసే రాజకీయ దాడిని వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. 151 మంది రికార్డు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా రాజీనామాలు చేయించి ఆర్ధికంగా రాష్ట్రం కష్టాల్లో ఉన్న సమయంలో ఎన్నికలకు కారణం అయ్యారనే విమర్శలను వైసీపీ మూటకట్టుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబుతో పోలిస్తే రాజీనామా చేయించి తీసుకోవటం వరకూ మంచి పద్దతే అయినా..రాజీనామాల అవసరం..ఆర్ధిక భారం..రాజకీయ అంశాలు అన్నవి ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతాయి. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత రంజుగా మారటం ఖాయంగా కన్పిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలకే పరిమితం అయినా రాజకీయంగా మాత్రం అటు అసెంబ్లీలో..ఇటు బయటా రాజకీయంగా మాత్రం ఎక్కడా దూకుడు తగ్గించటం లేదనే చెప్పాలి.

Next Story
Share it