Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు షాక్..ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముందుకే

చంద్రబాబుకు షాక్..ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముందుకే
X

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి ఇది ఊహించని షాక్. ఆయనపై దాఖలు అయిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణకు లైన్ క్లియర్ అయింది. దీంతో ఇప్పుడు ఏమి అవుతుందా? అన్న టెన్షన్ అందరిలో నెలకొంది. అయితే ఈ విచారణ ముందుకు సాగుతుందా? లేక మళ్ళీ చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంటారా అన్నది వేచిచూడాల్సిందే. అయితే ఈ కేసు ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం దాఖలు చేసింది కావటం విశేషం. ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసు విచారణ సాగుతోంది. ఇప్పుడు అదే జాబితాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా చేరతారా? వేచిచూడాల్సిందే. హైదరాబాద్‌ లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబు అక్రమాస్తులపై విచారణపై ముందుకెళ్ళటానికి అనుమతి మంజూరు చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు తెచ్చుకున్న స్టే గడువు ముగియడం, స్టే విష యంలో హైకోర్టు నుంచి ఎలాంటి పొడిగింపు లేకపోవడంతో కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభి స్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి సాంబశివరావు నాయుడు సోమ వారం లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారుగా ఉన్నలక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని నిర్ణయించి తదుపరి విచారణను ఈ నెల 25కి కోర్టు వాయిదా వేసింది. సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును, చంద్రబాబు స్టే గడువు ముగిసిన విషయాన్ని, ఆ స్టేకు ఎలాంటి పొడిగింపు లేకపోవడాన్ని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని వాదించారు. లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది సురేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఆ స్టే పొడిగింపు ఉత్తర్వులు లేవని కోర్టుకు వివరించారు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు వినడం సాధ్యం కాదంటూ చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు అప్పట్లో తోసిపుచ్చింది. దీనిపై ఆయన హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటి న్యాయమూర్తి డీఎస్‌ఆర్‌ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే ఉత్తర్వులిచ్చారు. స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్‌ దాఖలు చేయగా, దానిని హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి స్టే కొనసాగుతూ వస్తోంది.

Next Story
Share it