Telugu Gateway
Telangana

ఉద్రిక్తంగా మారిన ‘ఆర్టీసీ మిలియన్ మార్చ్’

ఉద్రిక్తంగా మారిన ‘ఆర్టీసీ మిలియన్ మార్చ్’
X

తెలంగాణలో ఎక్కడి ఆర్టీసీ కార్మికులను చాలా వరకూ అక్కడే అదుపులోకి తీసుకున్నారు. కీలక నేతలను అరెస్ట్ చేశారు. రాజకీయ నేతలదీ అదే పరిస్థితి. ఇక మిగిలింది ప్రజా సంఘాలు..కొంత మంది కార్మికులే. అయినా సరే వందల సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు..ప్రజా సంఘాల ప్రతినిధులు ఆర్టీసి కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ‘మిలియన్ మార్చ్’ వైపు వచ్చారు. పోలీసుల లాఠీచార్జీ, బాష్పావాయువు ప్రయోగాలు..పోలీసులపై కొన్ని చోట్ల రాళ్ళు విసరటాలు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, సచివాలయం ప్రాంతాల్లో శనివారం నాడు సాయంత్రం వరకూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ముఖ్యంగా ఆర్టీసీకి చెందిన మహిళా సిబ్బంది గేట్లు ఎక్కి మరీ ట్యాంక్ బండ్ వైపు పరుగులు పెట్టారు. వీరి సంఖ్య నామమాత్రంగానే వీరి తెగువ మాత్రం విశేషం. నిరవధిక సమ్మెలో భాగంగా తలపెట్టిన మిలియన్ మార్చ్ లో ఆర్టీసీ కార్మికులు బారికేడ్లను పడగొట్టి ఒక్కసారిగా ట్యాంక్‌బండ్‌ వైపు దూసుకు వచ్చారు. సీఎం డౌన్‌ ...డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసులు ఏర్పాటు చేసిన రక్షణ వలయాలను దాటుకుని ట్యాంక్‌ బండ్‌ చేరుకున్నారు.

ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితిని ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు ....పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేసి అక్కడ నుంచి తరలించారు. తాము ప్రభుత్వ ఆస్తులను రాసివ్వమని అడగటం లేదని, న్యాయమైన డిమాండ్లు సాధన కోసమే సమ్మెకు దిగామని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా తమకు జీతాలు లేవని, కుటుంబాలను ఎలా పోషించుకోవాలని అన్నారు. తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిని ఆశ్రయిస్తే... బిడ్డలను ఇలాగేనా చూసేది అంటూ ప్రశ్నించారు. పిల‍్లలకు స్కూల్‌ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన‍్నామని, తాము ఎలా బతకాలంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసుల లాఠీచార్జీలో పలువురు గాయాల పాలయ్యారు.

Next Story
Share it