Telugu Gateway
Politics

ఫడ్నవీస్ భవితవ్యం తేలేది రేపే

ఫడ్నవీస్ భవితవ్యం తేలేది రేపే
X

మహారాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బిజెపికి సుప్రీంకోర్ట్ షాకిచ్చింది. ఫడ్నవీస్ సర్కారుకు మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ నవంబర్ 30 వరకూ గడువు ఇవ్వగా..సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం బుధవారం సాయంత్రం ఐదు గంటలకు విశ్వాస పరీక్షను పూర్తి చేయాలని ఆదేశించింది. జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రొటెం స్పీకర్ తోనే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, విశ్వాస పరీక్ష పూర్తి చేయించాలని సుప్రీంకోర్టు సూచించింది. అదే సమయంలో ఎలాంటి సీక్రెట్ ఓటింగ్ లేకుండా బహిరంగంగా అంటే ప్రత్యక్ష ప్రసారం ఇచ్చి మరీ ఓటింగ్ ప్రక్రియకు ఆదేశించారు. దీంతో గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో సాగుతున్న పొలిటికల్ డ్రామాకు బుధవారం సాయంత్రం తెరపడనుంది. విపక్షాల కూటమి తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సోమవారం నాడు ఓ స్టార్ హోటల్ లో పరేడ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని రీతిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అకస్మాత్తుగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తేసి..ఎవరూ ఊహించని రీతిలో ఫడ్నవీస్ తో శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే.

ఈ పరిణామంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు షాక్ కు గురయ్యాయి. ఫడ్నవీస్ తోపాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే చివరకు ఎన్సీపీ ఎమ్మెల్యేలు అందరూ పవార్ చెంతకు చేరటంతో అజిత్ పవార్ కు షాకిచ్చినట్లు అయింది. ప్రస్తుతానికి వాతావరణం అంతా విపక్షాల కూటమికి అనుకూలంగా ఉన్నట్లు కన్పిస్తున్నా..విశ్వాస పరీక్షలో ఎలాంటి ఫలితం వస్తుంది అన్నది సస్పెన్స్ గా ఉంది. అయితే ఎన్సీపీ తరపున విప్ జారీ అవకాశం ఎవరికి ఇస్తారు అన్నది ఇఫ్పుడు కీలకంగా మారింది. అజిత్ పవార్ కే ఆ అధికారం ఉంది అని బిజెపి వాదిస్తుంటే...ఎన్సీపీ మాత్రం తాము కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్నామని..ఆయనకు హక్కు ఉంటుందని చెబుతోంది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ కూడా ఎన్సీపీ వర్తమానం పంపింది.

Next Story
Share it