Telugu Gateway
Politics

మహారాష్ట్రపై ‘బిజెపి సంచలన నిర్ణయం’

మహారాష్ట్రపై ‘బిజెపి సంచలన నిర్ణయం’
X

బిజెపి సంచలన నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో ఎలాగైనా అధికారం లోకి వచ్చేందుకు వివిధ పార్టీల మద్దతు తీసుకోవటం లేదా అవసరం అయితే పార్టీలను చీల్చటం వంటి చర్యలకు పాల్పడిన ఆ పార్టీ మహారాష్ట్రలోమాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. ఓ వైపు మిత్రపక్షం శివసేన షాక్ ల మీద షాక్ లు ఇస్తూ ఉత్కంఠకు కారణమైంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో ముందు ఒఫ్పుకున్నట్లు ఫిఫ్టీ ఫిఫ్టీ మోడల్ కు ఒఫ్పుకుంటేనే బిజెపికి మద్దతు ఇస్తామని శివసేన తేల్చిచెప్పింది. తాజాగా మహారాష్ట్ర గవర్నర్ బిజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఈ అంశంపై చర్చించేందుకు ఆదివారం నాడు మహారాష్ట్రలోని బిజెపి కోర్ కమిటీ సమావేశం అయి సంచలన నిర్ణయం తీసుకుంది. అందులోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ పంపిన ఆహ్వానంపై బీజేపీ ఎవరూ ఊహించని షాకింగ్ నిర్ణయం వెలువరించింది. సరైన సంఖ్యాబలం లేనందున ప్రభుత్వ ఏర్పాటుపై వెనుకంజ వేసింది. ఈ మేరకు బీజేపీ శాసనసభాపక్ష నేత, ఆపధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ గవర్నర్‌ను కలిసి ఈ విషయం తెలియజేశారు.

అయితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించిన విషయం తెలిసిందే. సోమవారంలోపు అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని గవర్నర్‌ గడవు విధించారు. దీనిపై ఆదివారం సాయంత్రం ఫడ్నవిస్‌ నివాసంలో భేటీ అయిన బీజేపీ కోర్‌ కమిటీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని నిర్ణయించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగినంత బలం లేదని.. సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసి తమ నిర్ణయాన్ని తెలిపింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. మరి ఇప్పుడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?. శివసేన ఎలా ముందకెళుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అన్న ఆంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది.అదే సమయంలో దమ్ముంటే శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి ఛాలెంజ్ చేయటం ఆసక్తికర పరిణామంగా మారింది.. చూస్తుంటే శివసేన దూకుడును బిజెపి అధిష్టానం కూడా చాలా సీరియస్ గానే తీసుకున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

Next Story
Share it