Telugu Gateway
Politics

ఆర్టీసీ కార్మికులకు కెసీఆర్ ‘రైట్ రైట్’

ఆర్టీసీ కార్మికులకు కెసీఆర్ ‘రైట్ రైట్’
X

ఆర్టీసీ కార్మికులు సమ్మె చాలించి తాము విధుల్లో చేరతామని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. వాళ్లు అలా ముందుకొచ్చినా సర్కారు మాత్రం కుదరదు పొమ్మంది. కానీ గురువారం నాడు మంత్రివర్గ సమావేశం అనంతరం కార్మికులకు సీఎం కెసీఆర్ ‘రైట్ రైట్’ అన్నారు. దీంతో ఇప్పుడు సర్కారు తన వైపు నుంచి సమ్మె విరమించినట్లు అయింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. కార్మికులు విధుల్లో చేరనున్నారు. దీంతో తెలంగాణ ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. దీంతో ఎట్టకేలకు తెలంగాణలో సుదీర్ఘ కాలం సాగిన ఆర్టీసీ సమ్మె సుఖాంతం అయినట్లు అయింది. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరొచ్చని సీఎం కెసీఆర్ పేర్కొన్నారు. అయితే సమ్మె ప్రభావం..సర్కారు ఆర్థిక కష్టాల దెబ్బకు ప్రయాణికులపై భారం పడనుంది. కిలోమీటర్ కు 20పైసల లెక్కన ఛార్జీలు పెంచటానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పెంచిన చార్జీలు కూడా సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్టీసీ ప్రైవేటుపరం చేయబోమని కెసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కోలుకునేందుకు తాత్కాలికంగా వంద కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కార్మిక సంఘాలను మాత్రం క్షమించబోమని అన్నారు. సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా యిచ్చారు. వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు.

వారి వారి అర్హతలను బట్టి ఉధ్యోగాలను నిర్ణయిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు క్రమశిక్షణతో ఉంటే సింగరేణిలా బోనస్‌లు ఇప్పిస్తానని, క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమని హెచ్చరించారు. డిపో నుంచి ఇద్దరితో వర్కర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు రియలైజ్ కావాలనే తాను సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించానని వెల్లడించారు. ఆర్టీసీ సంస్థ బతకాలన్నది తన ఉద్దేశమని, కార్మికుల మంచిచెడులు చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ‘మీరు బతకండి.. సంస్థను బతికించండి’ అంటూ ఆర్టీసీ కార్మికులకు హితవు పలికారు. వారం తర్వాత ఆర్టీసీ కార్మికులను ప్రగతి భవన్‌కు పిలిచి స్వయంగా మాట్లాడతానని చెప్పారు. ఆర్టీసీ సంబంధించిన అన్ని వివరాలను వారికి అందజేస్తానని అన్నారు.

ఆర్టీసీని ఏం చేయాలో కార్మికులే చెప్పాలని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులపై తమకు ఎటువంటి కక్ష లేదని కేసీఆర్‌ చెప్పారు. ఆర్టీసీపై మేము అనుకున్నది వేరు. బయట సన్నాసులు ప్రచారం చేసింది వేరు. టెంట్ కనిపిస్తే మాట్లాడే వాళ్లు ఏదేదో మాట్లాడి ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారు. కేంద్రంలో ఎల్లయ్యకు చెప్తే ఏమవుతుంది? తియ్యటి, పుల్లటి మాటలు తప్ప కేంద్రం నుంచి 5 వందల కోట్లు తెస్తారా? ఆర్టీసీ కార్మికులకు ఒక్క అవకాశం​ ఇవ్వాలని మంత్రులు చెప్పారు. కార్మికులు ఇప్పటికైనా రియలైజ్ కావాలి. బాధ్యత గల ప్రభుత్వంగా సంస్థ మనుగడ కోసం చార్జీలు పెంచుతున్నాం. ఆర్టీసీని పెట్టుబడుదారులకు ఇవ్వం. ఆరు రోజుల్లో ఢిల్లీ వెళ్లి వచ్చి అన్ని డిపోల నుండి 5 మంది కార్మికులతో స్వయంగా మాట్లాడతా. యూనియన్లను రానివ్వం. చిల్లర మాటలు పట్టించుకోము’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it