మళ్ళీ ఉద్యమ బాటలోకి ఆర్టీసీ జెఏసీ
ఆర్టీసీ సమ్మె వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చేలా ఉంది. ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేర్చుకుంటే తాము రెడీ అని జెఏసీ ప్రకటించినా కూడా సర్కారు ఈ విషయాన్ని తేల్చలేదు. దీంతో కార్మిక సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. సమ్మె కొనసాగుతుందని తెలిపారు. శనివారం నాడు జెఏసీ సమావేశం అయి మరోసారి నిర్ణయం తీసుకుంటామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. అదే సమయంలో శనివారం నాడు అన్ని బస్ డిపో ‘సేవ్ ఆర్టీసీ’ ఫేరుతో నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు.
అశ్వత్థామరెడ్డి శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. దీంతో సమ్మెను విరమించే ప్రసక్తేలేదని, సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. సమ్మెకు కొనసాగింపుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తమను ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కార్మికులు ఎవరూ డిపోల వద్దకు వెళ్లవద్దని ఆయన కోరారు. కార్మికుల వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం రాలేదని, సమ్మెకు కారణం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు.