ఏపీలో 7000 ఎకరాల్లో ‘కాన్సెప్ట్ సిటీలు’
ఒక్కోటీ 2,471 ఎకరాల్లో
ఏపీ సర్కారు కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో మూడు చోట్ల ఒక్కోటీ 2471 ఎకరాల లెక్కన ‘కాన్సెప్ట్ సిటీ’లు అభివృద్ధి చేయాలని తలపెట్టారు. ఈ ప్రాంతానికి అన్ని రకాల మౌలికసదుపాయాలు కల్పించి ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలు నేరుగా తమ యూనిట్లు ప్రారంభించేలా చేయటమే వీటి ఉద్దేశం. ఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో జగన్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖ, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో ఈ కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ప్రాథమికంగా 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సిటీలను ఏర్పాటు చేసేలా ఆలోచించాలని చెప్పారు. అమెరికాలోని ఇండియానాలో ఉన్న కొలంబియా సిటీని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. కంపెనీ సామర్థ్యం, సైజును బట్టి అక్కడ భూములు కేటాయిద్దామన్నారు. పరిశ్రమలు పెట్టదలుచుకున్న వారికి వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు, అవినీతి లేకుండా పారదర్శక విధానంలో వారికి వసతులు సమకూరుస్తామన్నారు. ప్రోత్సాహక ధరల్లో భూములు, నీళ్లు, కరెంటు ఇద్దామని సీఎం చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా మంచి మానవ వనరులను అందించాలని ప్రతిపాదించారు.