Telugu Gateway
Andhra Pradesh

ఏ జీవో లేకుండా చంద్రబాబు కేసులు పెట్టగలిగినప్పుడు?

ఏ జీవో లేకుండా చంద్రబాబు కేసులు పెట్టగలిగినప్పుడు?
X

ఏపీలో మీడియా స్వేచ్చకు ఎలాంటి ఢోకా లేదని మంత్రులు పేర్ని నాని..కొడాలి నాని తేల్చిచెప్పారు. ఏపీకి చెందిన జాతీయ, అంతరాష్ట్ర మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ కూడా హైదరాబాద్ లో మీడియా సమావేశం పెట్టి ఇదే విషయం వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో తో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని అందరూ మీడియాకు ధీమా ఇచ్చారు. అసలు ఏ జీవో లేకుండానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ పత్రిక ఎడిటర్, ఎడిటోరియల్ డైరక్టర్, రిపోర్టర్లపై కేసులు పెట్టగలిగినప్పుడు ఇక ఇబ్బంది ఏముంటుంది?. ఏపీలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం మీడియా అంశంపై ఏకంగా కేబినెట్ లో చర్చించి..ప్రత్యేకంగా జీవో విడుదల చేయాల్సిన అవసరం ఏముంది?. మంత్రి పేర్ని నాని చెప్పినట్లు దేశంలో మీడియా వేరు..ఏపీ మీడియా వేరే అనే అనుకుందాం?. నిరాధారమైన వార్తలు రాస్తే..కావాలని పరువు నష్టం కలిగించేలా వార్తలు రాస్తే ఎవరైనా..ఎప్పుడైనా కేసులు పెట్టుకోవచ్చు.

అసలు జీవోలు లేకుండానే ఈ పని చేయవచ్చు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలా చేసి చూపించారు కూడా. అలాంటప్పుడు తప్పుడు వార్తలు రాసేవారిపై నేరుగా కేసులు పెట్టుకునే వెసులుబాటు ఉండగా..మంత్రివర్గంలో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించి...ఆ తర్వాత ప్రత్యేకంగా మరో జీవో తేవాల్సిన అవసరం ఏముంది?. ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే అది రాసిన వారు తర్వాత పరిణామాలను కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవు. కానీ అవసరం లేకపోయినా మంత్రివర్గంలో మీడియాపై ‘ప్రత్యేకం’గా చర్చించి..జీవో తేవటంతోనే సర్కారు ఓ రకమైన బెదిరింపు ధోరణితో వెళుతుందనే అభిప్రాయం రావటానికి ప్రధాన కారణం అయిందనే చెప్పాలి. ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది అంటే అప్పటి వరకూ ఆ వెసులుబాటు లేకపోతే కొత్తగా వెసులుబాటు కల్పించారు అనుకోవచ్చు. కానీ అప్పటికే ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా..ప్రత్యేకంగా జీవో తెచ్చి అందరికీ అధికారాలు ఇవ్వటంతోనే అసలు ఉద్దేశం బహిర్గతం అవుతుంది.

Next Story
Share it