Telugu Gateway
Andhra Pradesh

రాజకీయాల్లో మత ప్రస్తావనలెందుకు?

రాజకీయాల్లో మత ప్రస్తావనలెందుకు?
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అధికారం కోల్పోవటంతో చంద్రబాబు వికృతంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. సొంత పుత్రుడు, దత్త పుత్రుడు దీక్షల తర్వాత చంద్రబాబు దీక్ష మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇసుక దీక్షలో చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌లను మించి యాక్టింగ్‌ చేశారని ఎద్దేవా చేశారు. ఇసుక కొరత వల్ల 50 మంది చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన వర్గాల వారు సీఎం జగన్‌ వెనుక ఉన్నారు కాబట్టే 151 సీట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు రాజకీయాల్లోకి మత ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. సీఎం జగన్‌ గురించి వ్యక్తి గత విమర్శలు చేయడం పాలసీ మ్యాటర్‌ అవుతుందా అని అయన పశ్నించారు.

పవన్‌ కల్యాణ్‌ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ తీసుకుని విమర్శలు చేస్తున్నారని, అలాగే ఆయన తప్పు చేసి మిగతా వారికి కూడా తప్పు చేయండని సూచిస్తున్నారని అన్నారు. అమరావతిలో చంద్రబాబు చేసిన నేరాలు బయటకు వస్తాయని, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే వీలు లేదు కాబట్టి పవన్‌ కల్యాణ్‌ను తన ధూతగా ఢిల్లీకి పంపి ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు దీక్షకు మెజార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదని.. ఇందుకు ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్ష చేసే రోజున ఇద్దరు టీడీపీ నేతలు సీఎం జగన్‌కు మద్దతు తెలిపారని అన్నారు. ఇక టీడీపీ మునిగిపోయే పార్టీ అని, ఆ పార్టీని పట్టుకుని పవన్‌ కల్యాణ్‌ వేలాడుతున్నాడని ఎద్దేవా చేశారు.

Next Story
Share it