Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ దూకుడు..మహేష్ స్లో!

అల్లు అర్జున్ దూకుడు..మహేష్ స్లో!
X

రెండు కీలక సినిమాలు. ఒకటి అల..వైకుంఠపురములో..మరొకటి సరిలేరు నీకెవ్వరు. ఈ రెండూ సినిమాలూ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికే ఢీకొడుతున్నాయి. తొలుత విడుదల తేదీలో రాజీ కోసం ప్రయత్నం చేసినట్లు వార్తలు వచ్చినా..అదేమీ పెద్దగా వర్కవుట్ అయిన దాఖలాలు కన్పించటం లేదు. ఇదిలా ఉంటే అల..వైకుంఠపురములో సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ యమ దూకుడు మీద ఉన్నాడు. మరో హీరో మహేష్ బాబు మాత్రం చాలా స్లోగా ఉన్నట్టు కన్పిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల...వైకుంఠపురములో సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల అయ్యాయి. ఆ పాటలు అలా ఇలా కాకుండా దుమ్మురేపాయి. సామజవరగమన పాటతో పాటు రాములో..రాములా సాంగ్ కూడా యూట్యూబ్ ను షేక్ చేసిందనే చెప్పాలి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకుడు కావటంతో కూడా హైప్ కు ప్రధాన కారణంగా ఉంది.

అయితే ఈ ప్రమోషన్ విషయంలో మహేష్ బాబు చిత్ర యూనిట్ చాలా స్లోగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన పస్ట్ లుక్స్ అయితే వచ్చాయి కానీ..అత్యంత కీలకమైన టీజర్..పాటలు మాత్రం రావాల్సి ఉంది. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన టీజర్ ను నవంబర్ 22న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు ప్రముఖ హీరోల సినిమాలు కావటంతో ఆయా హీరోల ఫ్యాన్స్ కూడా టీజర్ల దగ్గర నుంచి పాటల వరకూ ప్రతి విషయంలో వ్యూస్ పోటీ నెలకొంది. మరి ఈ సంక్రాంతి సీజన్ లో ఎవరు విజేతగా నిలుస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it