వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్
వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. గత రెండు రోజులుగా ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ప్రతిపక్ష టీడీపీకి కూడా ఈ అంశంపై సర్కారుపై తీవ్ర విమర్శలు చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏకంగా అసలు రాష్ట్రంలో శాంతి, భద్రతలు ఉన్నాయా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని డీజీపీ గౌతం సవాంగ్‌కు ఆయన స్పష్టం చేశారు.
సీఎం ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు రంగంలోకి దిగి కోటంరెడ్డిని అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలోని గొలగమూడి దగ్గర ఓ ప్రైవేట్ లేఔట్ కు సంబంధించి అనుమతుల విషయంలో ఎమ్మెల్యే ఎంపీడీవోతో దరుసుగా వ్యవహరించటంతోపాటు ఆమె ఇంటికి విద్యుత్ సరఫరా కట్ చేయించటంతోపాటు ఇంటి ముందు చెత్త వేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ పరిణామాలపై కోటంరెడ్డి కూడా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపించాలని..తన తప్పు ఉన్నట్లు తేలితే పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాన ఓకే అని వ్యాఖ్యానించారు. గతంలో కూడా కోటంరెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ సారి ఆరోపణలు ఎధుర్కొంటున్న సొంత పార్టీ ఎమ్మెల్యేను కూడా జగన్ అరెస్ట్ చేయించటం ఆసక్తికర పరిణామంగా మారింది.