Telugu Gateway
Politics

విభజన కంటే వైసీపీ వల్లే ఎక్కువ నష్టం

విభజన కంటే వైసీపీ వల్లే ఎక్కువ నష్టం
X

ఆంధ్రపద్రేశ్ కు విభజన వల్ల జరిగిన నష్టం కంటే వైసీపీ పాలన వల్లే ఎక్కువ నష్టం జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా, సంపద సృష్టిపై శ్రద్ద పెట్టకుండా, ఉన్నవన్నీ రద్దు చేసి, అన్నింటినీ కేంద్రంపైకి నెట్టేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. ‘రైతు భరోసా’ కొత్త స్కీమ్ ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. దీనికి ప్రధాని నరేంద్రమోడిని పిలవడం ఏమిటి..?. టిడిపి స్కీమ్ రద్దు చేసి, ఆ డబ్బులు మళ్లించడం, కేంద్రం ఇప్పటికే ఇస్తున్న రూ.6వేలు కలపడం..‘‘రైతు భరోసా’’ కొత్త స్కీమ్ గా ప్రజలను మోసం చేస్తున్నారు.

టిడిపి పథకాన్ని ఏ‘మార్చి’, కేంద్రం ఇచ్చే రూ.6వేలు అందులో వేసి, దానికి ప్రధానమంత్రిని పిలవడానికి అదేమైనా కొత్త స్కీమ్ కాదు కదా..? అని ప్రశ్నించారు. .గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.61,071కోట్లు కావాలని ప్రధానికి వినతి ఇచ్చారు. రూ.5,739కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇంకో రూ.40వేల కోట్లు కావాలన్నారు. ఇదంతా చేతులు దులుపుకునే విధానమే అని విమర్శించారు. ప్రధాని మోడీతో భేటీ వివరాలను జగన్ మీడియా సాక్షిగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. సీఎంవో అరకొర సమాచారంతో నోట్ విడుదల చేసి తప్పుకోవటం సరికాదన్నారు. ఇద్దరి మధ్య ఏయే అంశాలపై చర్చ జరిగిందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Next Story
Share it