ఆర్టీసి సమ్మెపై హరీష్ మాట్లాడరేందుకు?
ఆర్టీసి సమ్మెపై గతంలో ఆర్టీసీ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీష్‌రావు ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆరు నెలలు కొడుకు, అల్లుడికి మంత్రి పదవి లేకపోతే తట్టుకోలేకపోయారని మరి నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగాల కోసం ఎంతకాలం వేచి చూడాలని కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ, పోలీసు సంఘాలు 19 న జరిగే బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజులు డిపోకు రాలేదని ఉద్యోగులను తీసేస్తే మరి ఆరేళ్లుగా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని ఏం చేయాలి? పీడీ యాక్ట్ పెట్టాలా అని రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా నిలదీశారు. ఆదివారం హైదరాబాద్‌లో పీఆర్టీయూ తెలంగాణ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు ఆర్. కృష్ణయ్య, పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మంలో చనిపోయిన శ్రీనివాస్‌రెడ్డి ఆర్ధికంగా బలహీనుడు కాదని, ఉద్యోగ భద్రత గురించి ఆందోళనే అతని మృతికి కారణమని చెప్పారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి ముఖం చెల్లక ముఖ్యమంత్రి ప్రెస్‌నోట్లు రిలీజ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమ్మె చట్టబద్ధంగా జరుగుతుంటే ఆట మధ్యలో గేమ్ రూం మారుస్తామంటే కుదరదని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు సమ్మెను విఫలం చేస్తే భవిష్యత్తులో టీచర్లను కూడా పాలెగాళ్లుగా చూసే పరిస్థితి వస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ వద్దన్నవాళ్లను మంత్రులుగా నియమించి, సమాజంలో గౌరవం ఉన్నోళ్లను కేసీఆర్ దూరం పెట్టారని ఆరోపించారు. పెన్నుమీద మన్ను కప్పితే గన్నులై పేలుతయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీల వైపు చూడొద్దని, తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడకుండా మీ బాధ్యత సక్రమంగా నెరవేర్చండని రేవంత్ రెడ్డి హితబోధ చేశారు.