Telugu Gateway
Andhra Pradesh

రివర్స్ టెండరింగ్ తో ఆదా

రివర్స్ టెండరింగ్ తో ఆదా
X

చంద్రబాబు హయాంలో ఎక్సెస్ టెండర్లతో కాంట్రాక్టర్లకు దోచిపెడితే తాము రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని ఏపీ నీటీపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇలా మిగిలే డబ్బులను ప్రజాసంక్షేమం కోసం ఉపయోగిస్తామన్నారు. ఆదా చేస్తే అభినందించాల్సింది పోయి ప్రతిపక్షం రాజకీయం చేయటం ఏమిటని విమర్శించారు. అనిల్ కుమార్ యాదవ్ సోమవారం నాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిర్వహించిన రివర్స్‌ టెండర్ల వల్ల ఇప్పటివరకు రూ. 1500 కోట్లు ఆదా చేశామని వెల్లడించారు.

తాము రివర్స్‌ టెండర్లు వేయకపోతే ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లేదని ప్రశ్నించారు. వెలిగొండలో రూ. 61 కోట్లు మిగిలాయి. రాబోయే రోజుల్లో మరో రూ. 500 కోట్లు మిగులుతాయని భావిస్తున్నాం. అన్ని శాఖల్లోనూ రివర్స్‌ టెండరింగ్‌ చేపడితే నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి. చంద్రబాబు తన హయాంలో ఇలా చేసుంటే అంత డబ్బు మిగిలేది కదా? అలా కాకుండా ఎక్సెస్‌ టెండర్లు నిర్వహించి, ఇష్టమొచ్చిన నిబంధనలు పెట్టి తనకు అనుకూలంగా ఉన్నవారికి దోచిపెట్టారు. ఇసుక సమస్యపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదులకు వరదలు రావడం వల్ల ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడిందని వివరించారు.

Next Story
Share it