రవిప్రకాష్ పై సీబీఐ..ఈడీ విచారణ జరిపించాలి

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై పలు ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ కు లేఖ రాశారు. తన లేఖకు పలు ఆధారాలు కూడా జత చేశారు. అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించి ఆయన విదేశాల్లో పెట్టుబడులు పెట్టి నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ అంశాలు అన్నీ పరిశీలించి రవిప్రకాష్ పై సీబీఐతో పాటు ఈడీ దర్యాప్తు చేయించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి తన లేఖలో రవిప్రకాష్ తోపాటు ఆయన భార్య దేవిక పేరును కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. మీడియా రంగంలో ఉన్న రవిప్రకాష్ అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాల్లో దాచిపెట్టారు. ఇది మనీలాండరింగ్ నిరోధక చట్టం(వీఎంఎల్‌ఏ), ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ చట్టం(ఫెమా), ఆర్‌బీఐ నిబంధనలు, ఆదాయపు పన్ను చట్టంతో పాటు ఇతర చట్ట నిబంధనలకు విరుద్ధం. సానా సతీష్‌బాబుకు రవిప్రకాశ్ అత్యంత సన్నిహితుడు. సానా సతీష్, మొయిన్ ఖురేషీతో కలిసి బ్యాంకులను, ఎంఎంటీసీలను మోసం చేశారు. సానా సతీష్‌ను సీబీఐ, ఈడీలు ఇప్పటికే విచారిస్తున్నాయి. వీరంతా కూడా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి ఆ డబ్బును హవాలా మార్గంలో దేశం దాటించారు.
ముసద్దీలాల్ జ్యువెలర్స్‌కు చెందిన సుకేష్ గుప్తాతో కలిసి వీరంతా కూడా అక్రమ వ్యాపారాలు, కార్యకలాపాలు నిర్వహించారు. ఎన్నో ఆస్తులను కూడబెట్టారు. అక్రమంగా సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టారు. రవిప్రకాశ్‌కు పలు దేశాల్లో పలు రకాల చిరునామాలు, బ్యాంకు ఖాతాలున్నాయి. రవిప్రకాశ్, అతని భార్య దేవిక మీడియా ఎన్‌ఎక్స్‌టీ లిమిటెడ్‌లో చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇండో జాంబియా బ్యాంక్‌లో ఖాతా కూడా ఉంది. ఈ వివరాలను కూడా వీరు బహిర్గతం చేయలేదు. జాతి ప్రయోజనాలను ఆశించి ఈ ఫిర్యాదు చేస్తున్నా. ఈ ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రవిప్రకాశ్, అతని భార్య దేవిక, ఇతర సహాయకుల అక్రమాలు, అక్రమార్జనపై ఈడీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నా’’ అని తన లేఖలో పేర్కొన్నారు.