హీరోలందరూ మౌనం..హీరో భార్య మాత్రం మోడీపై ఫైర్
టాలీవుడ్ హీరోలు అందరూ ఆ విషయంలో మౌనంగానే ఉన్నారు. హీరోయిన్లు కూడా ఎవరూ మాట్లాడలేదు. కానీ ఓ స్టార్ హీరో భార్య. మెగాస్టార్ కోడలు ఉపాసన రామ్ చరణ్ మాత్రం ఫైర్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా ప్రధాని మోడీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎంతో బాధతో తన అభిప్రాయాలు చెప్పానని..సరైన స్పూర్తితో వీటిని తీసుకుంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అసలు విషయం ఏమిటంటే ఢిల్లీలో శనివారం నాడు భారత ప్రధాని నరేంద్రమోడీ బాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యారు. బయటకు వచ్చిన ఫోటోల ప్రకారం టాలీవుడ్ కు చెందిన వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజుతోపాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కన్పించారు. మిగిలిన ప్రముఖ హీరోలు..హీరోయిన్లు..దర్శకులు ఎవరూ కన్పించిన దాఖలాలు లేవు. మోడీ ఢిల్లీలోని లోక కళ్యాణ్ మార్గ్ లో #ChangeWithin పేరుతో బాలీవుడ్ సెలబ్రిటీలను కలిశారు.
ఈ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కంగనా రనౌత్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ సహా పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖలు హాజరయ్యారు. ఈ విషయాన్ని ..వారితో దిగిన పోటోలను మోదీ ట్విటర్‌లో షేర్ చేశారు. అక్కడే ఉపాసన రామ్ చరణ్ కు కోపం వచ్చింది. ఈ కార్యక్రమానికి దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఒక్క కళాకారుడికి కూడా ఆహ్వానం అందకపోవటంపై ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ట్వీట్ లోని ముఖ్యాంశాలు...‘ ప్రియమైన నరేంద్రమోడీ మీరు ప్రధాని అయినందుకు దక్షిణాది ప్రజలు గర్విస్తున్నారు. కానీ మీరు దక్షిణాది కళాకారులను నిర్లక్ష్యం చేయటం బాధించింది. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఉపాసన ట్వీట్ మాత్రం అటు పరిశ్రమతోపాటు..ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.