మేము సైతం సమ్మెకు రెడీ అంటున్న టీఎన్జీవోలు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. తాజా పరిణామాలతో టీఎన్జీవోలు ఆర్టీసీతో జత కలిశారు. ఈ నెల 19న జరిగే తెలంగాణ బంద్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అదే సమయంలో తమకు సర్కారుపై నమ్మకం ఉందని అంటూనే..గడువులోగా తమ సమస్యలను పరిష్కరించకపోతే తాము కూడా సమ్మెకు వెనకాడబోమని తేల్చిచెప్పారు. గురువారం సాయంత్రం సీఎస్ ఎస్ కె జోషీకి వినతిపత్రం అందజేసిన అనంతరం టీఎన్జీవో ప్రెసిడెంట్ కారం రవీంద్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు ‘సీఎస్ సానుకూలంగా స్పందించారు..మాకు ఇప్పుడు నమ్మకం ఏర్పడింది.ఈ నెలాఖరు లోగా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాము. 19న జరిగే ఆర్టీసీ బంద్ లో ఉద్యోగుల సంఘం పాల్గొటుంది. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం.
ఇచ్చిన సమయంలోగా పరిష్కారం లభించకపోతే మేము సమ్మెకు వెళ్ళడానికి వెనుకాడం. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం అనేది ఎక్కడ లేదు. ఆర్టీసీ చర్చల్లో మేము భాగస్వామ్యం కాలేదు. ఆర్టీసీ సమ్మె పరిస్థితి పై సీఎస్ కి తెలియజేశాం. ఆర్టీసీ కార్మికులు అధైర్య పడొద్దు. ఉద్యోగ సంఘాల ఐఆర్ పై వినతిపత్రం ఇచ్చాము. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉంది. హైకోర్టు సైతం సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. 17 అంశాలతో డిమాండ్ల ప్రతిని సీఎస్ కి ఇచ్చాము. రెవెన్యూ ఉద్యోగుల పై ఒత్తిడి పెరుగుతుంది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ కు వెంటనే తేవాలి. పెన్షన్స్, ఉద్యోగుల రిటైర్మెంట్ విరమణ వయసు పెంచాలి.’ అని డిమాండ్ చేశారు.