మూడు నెలల్లోనే ఏపీలో పది లక్షల రైతులు తగ్గిపోయారా?
బడ్జెట్ లో 64 లక్షలు అన్నారు..అమలు దగ్గరకొచ్చేసరికి 54 లక్షలకు తగ్గారు
రైతు భరోసా పథకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సర్కారు కూడా మోళీ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఏకంగా మూడు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో పది లక్షల రైతులను గాయబ్ చేసినట్లు సర్కారు లెక్కలే చెబుతున్నాయి. సాక్ష్యాత్తూ ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఏడాది జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఏపీలోని 64.06 లక్షల మందికి రైతు భరోసా కింద 12500 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీని కోసం బడ్జెట్ లో 8750 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కూడా అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. కానీ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులు సంఖ్య మొత్తమే 54 లక్షలే అని చెబుతున్నారు. అంతే కాదు..గత సర్కారు సాధికారిక లెక్కల ప్రకారం 43 లక్షల మందే రైతులే ఉన్నారని తేల్చిందని..కానీ తాము మాత్రం అత్యంత పారదర్శకంగా అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపచేయాలనే కృతనిశ్చయంతో గ్రామ సచివాలయాలు..వాలంటీర్ల ద్వారా సర్వే చేయించి 51 లక్షల రైతు కుటుంబాలకు రైతు భరోసా పథకం ద్వారా లబ్ది కల్పించాలని నిర్ణయించినట్లు జగన్ మంగళవారం నాటి సమావేశంలో తెలిపారు.
అంతే కాదు..బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మూడు లక్షల మంది కౌలురైతులకు కూడా ప్రయోజనం వర్తింపచేస్తున్నామని ప్రకటించారు. దీంతో మొత్తం రైతుల సంఖ్య 54 లక్షల మందికి చేరుతుందని అన్నారు. రైతులంటే రైతులే కానీ..ఇలా కులాల వారీగా రైతు లబ్దిదారుల ఎంపిక ఉంటుందా?. ఈ ఏడాది జూన్ లో సర్కారే స్వయంగా 64.06 లక్షల మందికి ప్రయోజనం కల్పిస్తున్నట్లు చెప్పి..ఇఫ్పుడు సడన్ గా ఆ సంఖ్యను 54 లక్షలకు తగ్గించటం వెనక మతలబు ఏమిటి?. పైగా గత సర్వే కంటే తాము అర్హుల సంఖ్యను పెంచామని చెబుతున్నట్లు జగన్ ప్రకటించారు. మరి బడ్జెట్ సమయంలో చెప్పిన ఈ 64 లక్షల లెక్క ఎక్కడ నుంచి వచ్చింది?. ఇప్పటి లెక్క ఎక్కడిది. జగన్ చెప్పినదే నిజమైతే...రైతుల లెక్క పెరగాలి కానీ ఎలా తగ్గుతుంది? ఈ లెక్కలు చూస్తుంటే రైతు భరోసా విషయంలో సర్కారు గోల్ మాల్ స్పష్టంగా కనపడుతోందనే చెప్పొచ్చు.