Telugu Gateway
Telangana

ఆర్టీసి బస్సుపై రాళ్ళ దాడి

ఆర్టీసి బస్సుపై రాళ్ళ దాడి
X

తెలంగాణలో ఆర్టీసి సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఆర్టీసి కార్మికులు తాత్కాలిక సిబ్బందితో కొన్ని చోట్ల ఘర్షణలకు దిగుతున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం శాంతియుతంగా పూలు ఇచ్చి తమ పొట్టకొట్టొద్దని వేడుకుంటున్నారు. పలు చోట్ల బస్సు డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి.అయితే తాత్కాలిక డ్రైవర్లు..కండక్టర్లపై దాడులు చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసి సమ్మెకు ఎప్పుడు ముగింపు పడుతుందా అన్న ఆందోళనలో ప్రజలు..విద్యార్ధులు ఉన్నారు. ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడికి దిగారు.

దీంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడి నుంచి ప్రయాణికులకు తృటిలో తప్పించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ వెళ్తున్న బస్సుపై చేవెళ్ల సమీపంలో దుండగులు దాడి చేశారు. వికారాబాద్‌ డిపో అధికారులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ జంపన్న డిపో ముందు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు జంపన్నను అడ్డుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్ జీడిమెట్ల బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. మహిళా కండక్టర్లంతా కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

Next Story
Share it