Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ పాలనలోనూ ఇసుక మాఫియా

వైసీపీ పాలనలోనూ ఇసుక మాఫియా
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీసీ సర్కారుకు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాగే పరిపాలిస్తే ప్రజలు రోడ్డు మీదకు వచ్చి దెబ్బకొట్టే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. సర్కారు తీరుపై ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసన వ్యక్తమవుతోందని అన్నారు. ఏ ప్రభుత్వమైనా సవ్యంగా పరిపాలిస్తే మిగతా పార్టీలకు పని ఉండదు. ఇసుక సమస్య వల్ల లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు కనుకే నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ చేస్తున్నామ”ని అన్నారు. టీడీపీ హయాం తరహాలోనూ ఇప్పుడు కూడా ఇసుక మాఫియా నడుస్తోందని ఆరోపించారు. పక్క రాష్ట్రాల్లో ఇసుక దొరుకుతుంది కానీ..ఏపీలో మాత్రం దొరకటంలేదని అన్నారు. సాక్ష్యాత్తూ సర్కారే జీఎస్టీకి ఎలా గండికొట్టాలో ఆలోచించమని జీవోలో పెడుతుందా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇది ఎక్కడి పద్దతి అని ప్రశ్నించారు. జీవో నంబరు 486 పై ప్రధానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలసి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల మూలంగా లక్షల మంది కార్మికులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, వాహన యజమానులు రోడ్డునపడ్డారు అని తెలిపారు.

కేవలం ఇసుక రవాణాపైనే ఆధారపడి ఉన్న 6 వేల లారీలకే పనుల్లేకుంటే కొత్తగా మరో 6 వేల లారీలను రంగంలోకి దించడం విడ్డూరమన్నారు. లారీలకు రుణాలిప్పించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ఆహ్వానించదగ్గ విషయమే.. అయితే ఉన్న లారీల సంగతి ఏంటి..? ఎవరి లబ్ది కోసం ఈ ప్రయత్నమని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. 10 మందికి ఉద్యోగం కల్పించడం కోసం 10వేల మందిని తీసేస్తున్నారు. కొత్త ఉద్యోగాలు సృష్టించాలి కానీ ఉన్న ఉద్యోగాలు తీసేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చే పద్ధతి మంచిది కాదని తెలిపారు. ఇసుక ఆన్ లైన్ సిస్టమ్ లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. దొంగల్లా అర్ధరాత్రి 12 గంటలకు తెరుస్తున్నారని విమర్శించారు. రాజధాని ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ వెటకారంగా మాట్లాడతారు. మీరు తీసుకుంటున్న నిర్ణయాలకు కోట్లాది మంది ప్రజలు ప్రభావితులు అవుతారని మరిచిపోతున్నారు. తెలుగుదేశం పార్టీపై కోపాలు తాపాలు ఉంటే వేరేలా చూపించుకోండి.

హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ రాయలసీమకు చెందిన లాయర్లు వచ్చి కలిశారు. ఇప్పటి వరకు సీమ నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారు. అయినా సీమ సమస్యలు తీరలేదు. ప్రస్తుత హైకోర్టు పరిసరాల్లో టీ కూడా దొరికే పరిస్థితి కూడా లేదు. వైసీపీ ప్రభుత్వానికి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నారు. రాజధాని కడతారా లేదా..? రాయలసీమకు హైకోర్టును తరలిస్తారా..? లేదా అన్నది స్పష్టంగా చెప్పండి. అంబటి రాంబాబు కామెంట్లు కూడా నా దృష్టికి వచ్చాయి. మీ మీద గౌరవం ఉంది. మాటలు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి. ఎన్నికలు ఐదేళ్లు ఉన్నాయి అనుకుంటున్నారేమో ముందే వస్తాయి. అవన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. భవన నిర్మాణ కార్మికులను సంక్షోభం నుంచి రక్షించడానికి ఏం చేస్తారో చెప్పండి. మీ ప్రభుత్వ విధానాల వల్ల మరో సంవత్సరం పాటు రోడ్డు మీదే ఉండే పరిస్థితి కనిపిస్తోందని ధ్వజమెత్తారు.

Next Story
Share it