Telugu Gateway
Telangana

అవసరం అయితే ట్యాంక్ బండ్ పై ‘మిలియన్ మార్చ్’

అవసరం అయితే ట్యాంక్ బండ్ పై ‘మిలియన్ మార్చ్’
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రగతి భవన్ లో ఒంటరి అయ్యారని తెలంగాణ జన సమితి (టీజెఎస్) అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. కెసీఆర్ వెంబడి మంత్రులు లేరు..ఎమ్మెల్యేలు లేరన్నారు. ఆర్టీసి సమ్మెపై కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి సర్కారు అవమానించిందని కోదండరాం ఆరోపించారు. కోర్టు చెప్పినా కూడా ఈ ప్రభుత్వంలో కదలిక రావటంలేదన్నారు. ఆర్టీసిపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయటం కరెక్ట్ కాదన్నారు. ఆర్టీసి కార్మికుల సమ్మెకు తెలంగాణ సమాజం మద్దతు ఉందని కోదండరాం వ్యాఖ్యానించారు. గత 25 రోజులుగా ఆర్టీసి కార్మికులు అత్యంత ప్రశాంతంగా తమ సమ్మె కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. అవసరం అయితే ట్యాంక్ బండ్ మిలియన్ మార్చ్ చేస్తామని తెలిపారు. ఆర్టీసీ జెఏసీ నేత అశ్వత్థామరెడ్డి కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసి కార్మికుల సమ్మెకు మద్దతుగా బుధవారం సాయంత్రం సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ‘సకల జనభేరి’ సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన నేతలు పాల్గొని ఆర్టీసీ కార్మికులకు తమ సంఘీభావం తెలిపారు.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసీఆర్ సర్కారులో ఆర్టీసి విలీనం గురించి తాము మేనిఫెస్టోలో చెప్పలేదని ఇప్పుడు అంటున్నారని ఎద్దేవా చేశారు. 20 శాతం బస్సులను మెగా కృష్ణారెడ్డికి ఇస్తానని..మిగిలిన 30 శాతం అద్దె బస్సులు..50 శాతం మాత్రమే ఆర్టీసి బస్సులు తిప్పుతామని మ్యానిఫెస్టోలో పెట్టారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కొడుకు, అల్లుడు, కూతురులకు మంత్రి పదవులు..ఎంపీ పదవులు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారా? అని నిలదీశారు. తనకు అవసరమైన చోట అవసరమైనట్లు నిర్ణయాలు మార్చుకుంటూ కోట్లాది మంది ప్రజలకు సేవ చేస్తున్న ఆర్టీసి కార్మికులను ఇబ్బందులకు గురిచేయటం ఏ మాత్రం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి అంశాన్ని కోర్టు ద్వారా పరిష్కారం తెచ్చుకోవాల్సి వస్తుందని విమర్శించారు.

బడుగు బలహీన వర్గాలన్నీ కేసీఆర్ పాలనలో మోసపోతున్నారు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి సీమాంధ్ర సీఎంలు అనుమతులు ఇచ్చారు..కానీ కేసీఆర్ ఇవ్వడం లేదు. ఆర్టీసీ విలీనం జరగకపోతే ఏపీ నిర్ణయమే తెలంగాణకు కూడా వర్తిస్తుంది. 50వేల కార్మికుల అజెండా జెండా హైదరాబాద్ సరూర్ నగర్ లో ఎగురుతుందని అన్నారు. మందకృష్ణ మాదిక మాట్లాడుతూ ఐదున్నర సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఇబ్బందులు తప్ప సంతోషం లేదన్నారు. కేసీఆర్ ని చూసి మాట్లాడేందుకు బయడుతున్న సమయంలో మొట్టమొదటిసారి ఆర్టీసీ ఎదురించింది. ఆర్టీసీని ఖతం చేస్తానంటే కేసీఆర్ ఖతం అవ్వడం ఖాయం అని వ్యాఖ్యానించారు. కార్మికులు మాత్రం ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. భారీ ఎత్తున సకల జనభేరికి తరలివచ్చి సభను విజయవంతం చేశారు. హైకోర్టు చెప్పిన గడువుకు కొన్ని నిమిషాల ముందే సమావేశాన్ని ముగించారు. బిజెపి నేత, మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ సీఎం కెసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు విదానాలతో తుగ్లక్ పాలన చేస్తున్నారని విమర్శించారు. కెసీఆర్ పెద్ద అవకాశవాది అని ఆరోపించారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఆర్టీసి సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. సెల్మ్ డిస్మిస్ పేరుతో వేలాది కార్మికులను మనోవేధనకు గురిచేస్తున్నారని అన్నారు. ఆర్టీసి కార్మికుల ఆత్మహత్యలకు కెసీఆరే బాధ్యత వహించాలన్నారు.

Next Story
Share it