Telugu Gateway
Politics

మీరే కాపాడాలి...చినజీయర్ దగ్గరకు ఆర్టీసి కార్మికులు

మీరే కాపాడాలి...చినజీయర్ దగ్గరకు ఆర్టీసి కార్మికులు
X

తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ ‘చినజీయర్’ ఆశ్రమం బాటపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం రెవెన్యూ ఉద్యోగులు చినజీయర్ ను కలసి ముఖ్యమంత్రి కెసీఆర్ రెవెన్యూ శాఖను రద్దు చేస్తామని చెబుతున్నారని..మీరే కాపాడాలంటూ వెళ్ళి ఓ వినతిపత్రం అందజేశారు. అప్పట్లో అదే పెద్ద సంచలనంగా మారింది. చినజీయర్ స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పెద్ద భక్తుడనే విషయం తెలిసిందే. తాజాగా చినజీయర్ ఆశ్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా కెసీఆర్ సతీసమేతంగా పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు బుధవారం నాడు ‘మీరే కాపాడాలి’ అంటూ చినజీయర్ స్వామి దగ్గరకు వెళ్ళారు. రాజేంద్రనగర్, మహేశ్వరం డిపోలకు చెందిన 300 మంది కార్మికులు ముచ్చింతల్ ఆశ్రమంలో చినజీయర్ ను కలిశారు. ఎలాగైనా ఆర్టీసి సమ్మె వ్యవహారం పరిష్కారం అయ్యేలా చూడాలని చినజీయర్ ను కోరినట్లు ఇందులో పాల్గొన్న ఆర్టీసి కార్మికులు తెలిపారు.

గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఆర్టీసి సమ్మె సామాన్య ప్రజలతోపాటు విద్యార్ధులను, ఉద్యోగులను ఎంతో మందిని ఇక్కట్ల పాలు చేస్తోంది. ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం సమ్మె విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అటు కార్మిక సంఘాలు కూడా తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే విధుల్లో చేరతామని చెబుతున్నాయి. హైకోర్టులో ఆర్టీసీ సమ్మె విషయంలో వాదనలు నడుస్తున్నా కూడా సర్కారు ఏ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. దీంతో కొంత మంది కార్మికులు చినజీయర్ ను ఆశ్రయించటం విశేషం. ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా ఇప్పుడు అందరూ చినజీయర్ బాటే పడుతున్నారు. మరి ఆయన జోక్యం చేసుకుంటారా?. సమస్య పరిష్కరిస్తారా?. కెసీఆర్ ఈ విషయంలో చినజీయర్ మాట వింటారా?. వేచిచూడాల్సిందే.

Next Story
Share it