Telugu Gateway
Telangana

తెలంగాణ ఉద్యమంలోనూ ఇంత దుర్మార్గం చూడలేదు

తెలంగాణ ఉద్యమంలోనూ ఇంత దుర్మార్గం చూడలేదు
X

ఆర్టీసీ జెఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నేతృత్వంలోని బృందం సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై ను కలసి పరిస్థితిని నివేదించారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెపై మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ.. కార్మికులను రెచ్చకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛలేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో దహనకాండపై గవర్నర్‌కు వివరించామని, తమ వినతులపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు.

టీఎన్జీయూ అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అశ్వత్థామరెడ్డి తెలిపారు. కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వనం పలకాలని సూచించారు. ‘ఉద్యోగ సంఘాలు సీఎం కేసీఆర్‌ను కలవడాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఉద్యోగ సంఘాలతో నిన్న భేటీ కావాలని అనుకున్నాం. అయితే డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మరణంతో కలవడం కుదరలేదు’ అని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో త్వరలో భేటీ అవుతామని పేర్కొన్నారు. తమకు ఏ రాజకీయ నాయకులతో ఒప్పందాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు ఎవ్వరూ సహనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేకే రాసిన లేఖపై తాము ఓపెన్‌గా ఉన్నామని అన్నారు.

Next Story
Share it